కేఏ పాల్ మళ్లీ వేశాడు.. ఈ సారి బాబు, పవన్.. కాంగ్రెస్‌ను వదలనీ..
కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ అధినేతగా.. క్రైస్తవ మత ప్రబోధకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఆయనను సిద్దిపేటలో పోలీసులు ఆపగా.. ఒకరు దాడి చేసిన సంగతి తెలిసిందే. సదరు వ్యక్తి టీఆర్ఎస్ కార్యకర్తి అని.. తన ప్రాణాలకు హానీ ఉందని నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీకి మీదకు మళ్లారు. విపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శలు చేశారు.

బాబు నాశనం చేశాడు..
చంద్రబాబు రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేశాడని కేఏ పాల్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకి వయసు అయిపోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడుకు కోసమే ఆయన ఇంకా రాజకీయాలు చేస్తున్నారని మనసులోని మాటను బయటపెట్టారు. చంద్రబాబు గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ అని కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారో ఆయనకే తెలియదన్నారు. తొమ్మిది పార్టీలు.. తొమ్మిది నామాలు పెట్టారని విమర్శించారు.

ఆ పార్టీతో చెట్టాపట్టాల్
ఇటు బీజేపీని కూడా వదల్లేదు. ఆ పార్టీ మతతత్వ పార్టీ అని తిట్టిపోశారు. ఇప్పుడు అదే పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని దుమ్మెత్తి పోశారు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఆయనకు లేదన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్లు పవన్ అన్న చిరంజీవికి వంద కోట్ల ప్యాకేజీ ఇచ్చారని.. ఇప్పుడు పవన్‌కు ఏ పార్టీ ఎన్ని కోట్ల ప్యాకేజీ ఇచ్చిందో తెలియదన్నారు.

ఆ రాష్ట్రాల్లో ఏంటీ..?
కాంగ్రెస్ పార్టీ పైనా పాల్ నిప్పులు చెరిగారు. 60 ఏళ్లు పాలించిన పార్టీ దేశాన్ని నాశనం చేసిందన్నారు. రాహుల్ గాంధీ సభకు జనాన్ని తరలించారని పాల్ ఆరోపించారు. రాహుల్ వాగ్దానాలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీ వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఆ పార్టీని ఎప్పుడో మరిచిపోయారని అన్నారు.

యువకుడి దాడి
ఇటీవల బస్వాపూర్‌లో రైతులను పరామర్శించేందుకు వెళ్తుండగా.. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద పాల్‌పై దాడి జరిగింది. పోలీసులతో కేఏ పాల్ మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి పాల్ పై దాడి చేశాడు. దీనిపై పాల్ తీవ్రంగా స్పందించారు. తనను హత్య చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు వచ్చాయని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ తనను చంపాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.