కనకదుర్గ గుడి వెండి సింహాల మాయం .. బాలకృష్ణ పనే .. కేసును ఛేదించిన పోలీసులు ?
విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో,అమ్మవారి వెండి రథంలో మూడు సింహాలు చోరీకి గురి కావటం, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల తీవ్ర వ్యాఖ్యలు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యటం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు కేసును చేదించినట్టు తెలుస్తుంది.
కనకదుర్గ ఫ్లైఓవర్ క్రెడిట్ మాదే .. కేశినేని నానీ, విజయసాయిలతో పాటు పోటీలో బీజేపీ నేతలు కూడా

మూడు సింహాలు మాయమైన ఘటనలో కేటుగాడ్ని పట్టుకున్న పోలీసులు
దుర్గ గుడి అమ్మవారి రథంలో మూడు వెండి సింహాలు మాయమైన కేసులో ఇప్పటికే పలువురు విచారించిన పోలీసులు ఫైనల్ గా వెండి సింహాలను చోరీ చేసిన కేటుగాడిని పట్టుకున్నట్లుగా సమాచారం.
దుర్గ గుడిలో అమ్మవారి వెండి రథంపై మూడు సింహాలు మాయమైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. రామతీర్థం లో రథం దగ్ధం ఘటనపై తరువాత, వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆలయాల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించింది.

పశ్చిమ గోదావరికి చెందిన పాత నేరస్తుడు చోరీ చేసినట్టు సమాచారం
ఇక ఈ నేపథ్యంలో దర్యాప్తు కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విచారణ చేశారు. ఆలయంలో పనిచేసే సిబ్బంది తో పాటుగా, దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో పనిచేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, పలువురు ఆలయాలలో దొంగతనాలు చేసే పాత నేరగాళ్ల ను సైతం విచారించారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు ఈ చోరీకి పాల్పడినట్లు గా పోలీసులు గుర్తించారని సమాచారం.

పోలీసుల అదుపులో బాలకృష్ణ ?
ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు దొంగతనాల కేసులో బాలకృష్ణ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు .ఈ నిందితుడిని విచారిస్తున్న క్రమంలో దుర్గ ఆలయం లో అమ్మవారి వెండి రథంపై మూడు సింహాలను తానే దొంగిలించినట్లుగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుని కీలక విషయాలను రాబడుతున్నట్లుగా సమాచారం. అమ్మవారి రథంపై మూడు వెండి సింహాలను మాయం చేసిన కేటుగాడు తుని లోని జువెలరీ షాప్ లో ఈ వెండి సింహాలను విక్రయించినట్లు గా తెలుస్తుంది.

జ్యూవెలరీ షాప్ యజమానిని కూడా విచారిస్తున్న పోలీసులు
సదరు జువెలరీ షాప్ యజమాని వెండి విగ్రహాలను కరిగించినట్లుగా విచారణలో తేలింది. జూలరీ షాపు యజమానిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో నిందితుల అరెస్టు ను పోలీసులు ఇంకా ధ్రువీకరించవలసి ఉంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో దుమ్మురేపిన దుర్గగుడిలో వెండి సింహాలను మాయం చేసిన కేటుగాడు దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తుడే కావడం గమనార్హం.