టీడీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలపై ఎంపీ కేశినేని నాని... చంద్రబాబు చెప్తే ఆ పని చేస్తా అని సంచలన ప్రకటన
విజయవాడ టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా కేశినేని నానిని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబుకు తాము కావాలో, కేశినేని నాని కావాలో తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. కేశినేని నాని కి దమ్ముంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. బెజవాడ టిడిపి నేతలు తనపై చేసిన ఆరోపణలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు.
కేశినేని నానీ పై బెజవాడ నేతల తిరుగుబాటు .. చెప్పుతో కొట్టే వాళ్ళమని తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు ఆదేశించిన మరుక్షణంరాజీనామా చేస్తానన్న కేశినేని నానీ
చంద్రబాబు ఆదేశించిన మరుక్షణం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తన తీరు నచ్చకపోతే తనపై ఆరోపణలు చేసిన వారు చంద్రబాబుకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్న కేశినేని నాని , విభేదాలు ఉన్నాయని వారు అంటున్నారని, లేవని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసినప్పటికీ తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయబోనని తేల్చిచెప్పారు కేశినేని నాని.
రేపు చంద్రబాబు పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ మార్పుతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు .

టిడిపి నాయకులు చేసిన విమర్శలను వారి విచక్షణకే వదిలిపెడతా
రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం కలిసి రూపొందించాయని కేశినేని నాని పేర్కొన్నారు. తనపై టిడిపి నాయకులు చేసిన విమర్శలను వారి విచక్షణకే వదిలిపెడతానని కేశినేని నాని స్పష్టం చేశారు. తాను కూడా పార్టీ కోసమే కష్టపడుతున్నానని పేర్కొన్న కేశినేని నాని విజయవాడ కార్పొరేషన్ పై తెలుగుదేశం జెండా ఎగురవేయాలన్నదే తన ధ్యేయం అన్నారు . ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వారు చెప్పుకునే హక్కు ఉందన్నారు. తన వెంట ఉన్నది, తన ఆత్మ బంధువులు గా భావించేది బీసీలు, ముస్లిం మైనారిటీ లని కేశినేని నాని పేర్కొన్నారు.

తాను తప్పు చేసినట్లు పార్టీ భావిస్తే తనను సస్పెండ్ చెయ్యొచ్చు
తన దారిలో తాను వెళుతున్నానని, తనకు తెలియని బాధ కొందరికి కలుగుతుందని పేర్కొన్న కేశినేని నాని, తాను తప్పు చేసినట్లు పార్టీ భావిస్తే తనను సస్పెండ్ చేయాలని చెప్పారు. చంద్రబాబు ఎవరికి టిక్కెట్ ఇస్తే వారే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని కేశినేని నాని స్పష్టం చేశారు.
విజయవాడ నగరపాలక ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం అందరూ కలిసి కష్టపడాల్సి ఉందని కేశినేని నానీ పేర్కొన్నారు . తెలుగు తమ్ముళ్ళ మధ్య ఉన్న విబేధాలు విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని ఏ స్థానంలో నిలబెడతాయో వేచి చూడాలి .