ఏపీకి శకుని చంద్రబాబు .. నిరూపిస్తే ఉరేసుకుంటా, రాజకీయాల నుండే తప్పుకుంటా : కొడాలి నానీ ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎన్ని ఇళ్ళు కట్టించాడో చెప్పాలంటూ కొడాలి నాని సవాల్ చేశారు. గుడివాడలో 17 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ,ఇళ్లను ఇస్తామని, మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మరీ ఇస్తామని పేర్కొన్నారు. అలా జరగని పక్షంలో వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండి పోటీ చేయను అని మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు.
ఎన్నికలు వాయిదా వేస్తే ఎవరికి నష్టమో చంద్రబాబు ,నిమ్మగడ్డ చెప్పాలి : మంత్రి కొడాలి నానీ

అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే ఉరి వేసుకోవడానికి సిద్ధం అన్న మంత్రి
తాను అవినీతికి పాల్పడినట్టు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు కొడాలి నాని .అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే ఉరి వేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల కోసం చేసిందేమీ లేదని పేర్కొన్న మంత్రి కొడాలి నాని ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబు శకునిలా అన్నిటికీ అడ్డు పడుతున్నాడు
ఒకపక్క టిడిపి, సిపిఐ నాయకులు టిడ్కో ఇళ్ళ గృహప్రవేశాలకు పిలుపునిచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తే, మరోపక్క గుడివాడ మార్కెట్ యార్డ్ లో టిడ్కో లబ్ధిదారులతో మంత్రి కొడాలి నాని బహిరంగ సభ నిర్వహించారు. మార్కెట్ యార్డ్ నుండి మల్లయ్య పాలెం టిడ్కో గృహాల వరకు పాదయాత్ర నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇల్లు ఇవ్వలేకపోయాడు అని, శకునిలా అన్నిటికీ అడ్డుపడుతున్నారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు వెన్నుపోటు దారుడు .. కాకిలా కలకాలం ఉంటాడు..
చంద్రబాబు కాకిలా కలకాలం ఉంటారని, వెన్నుపోటు సంస్కృతి ఆయన సొంతమని , సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడని తిట్టిపోశారు. ఇతర పార్టీలలో చీలికలు ఉన్నాయంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు కొడాలి నాని. బాబు అండ్ కో కు కులగజ్జి పట్టుకుందని, ఇతర కులస్తులు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నాడని విమర్శించారు. 2024 ఎన్నికల నాటికి తాను పేదలకు ఇళ్ళు ఇవ్వకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు.

పేదలకు ఇళ్ళు ఇవ్వకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటా
తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, ప్రజల అభివృద్ధి కోసమే తాను నిరంతరం పాటుపడుతున్నానని కొడాలి నాని చెప్పుకొచ్చారు.
తాను గుడివాడ గడ్డపై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని , ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలకు న్యాయం చేయాలని ఒక ఎమ్మెల్యేగా తపన పడుతున్నానని పేర్కొన్న కొడాలి నాని అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో ఇళ్ల స్థలాలను ఇవ్వడం కోసం 94 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 181 ఎకరాల తీసుకున్నామని పేర్కొన్నారు. ఎనిమిది వేల మందికి సెంటు స్థలం ఇస్తామని చెప్పిన ఆయన, టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారుల దగ్గర చంద్రబాబు డబ్బులు కట్టించుకున్నాడు అంటూ విమర్శించారు. ఇప్పుడు తాము పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే కోర్టులకు వెళ్లి అడ్డుపడుతున్నారు అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోపు పేదలకు ఇళ్ళు ఇవ్వకుంటే రాజాకీయాల నుండే తప్పుకుంటా అంటూ కొడాలి నానీ పేర్కొన్నారు .