కొట్టకపోతే రాష్ట్రం వదిలిపోతా..దేవినేని సవాల్ కు కొడాలి నానీ ఘాటు జవాబు ; సై అన్న వల్లభనేని వంశీ
బెజవాడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొడాలి నాని దేవినేని ఉమా పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఆతర్వాత దేవినేని ఉమా కొడాలి నాని వ్యాఖ్యలకు కౌంటర్ గా గొల్లపూడి సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానని సవాల్ చేయడం, దీంతో పోలీసులు దేవినేని ఉమా ను అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో దేవినేని ఉమకు
కొడాలి నానీ ప్రతి సవాల్ చేశారు . కచ్చితంగా కొడతా అని వార్నింగ్ ఇచ్చారు . కొడాలి నాని కి చేసిన ఛాలెంజ్ కు వల్లభనేని వంశీ సై అన్నారు.

అక్కడే కొట్టక పోతే నేను రాష్ట్రం విడిచి వెళ్ళి పోతాను : కొడాలి నానీ ప్రతి సవాల్
దేవినేని ఉమా చేసిన సవాల్ కు కొడాలి నాని ప్రతి సవాల్ విసిరారు. దేవినేని తనను టచ్ చేసి చూడు అని కొడాలి నాని కి సవాల్ విసిరిన నేపథ్యంలో స్పందించిన కొడాలి నాని దీక్షకు పోలీసులు ఒప్పుకోరని తెలిసి దేవినేని నాటకమాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు తాను పది సార్లు దేవినేని ఉమా కి ఫోన్ చేశానని ఉమా తో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు దేవినేని ఉమా కు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలన్నారు. మీడియా సమక్షంలో ఇరువురి మేనిఫెస్టో గురించి చర్చిద్దాం. అక్కడే కొట్టక పోతే నేను రాష్ట్రం విడిచి వెళ్ళి పోతాను అంటూ మరోమారు ప్రతి సవాల్ విసిరారు.

మీడియా చానల్లో చర్చిద్దాం రా .. దేవినేని ఉమా ఛాలెంజ్ కు సై అన్న వల్లభనేని వంశీ
బహిరంగ చర్చ జరిగితే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పైన ఏ మీడియా చానల్లో అయినా చర్చించటానికి తాము సిద్ధంగా ఉన్నామని వల్లభనేని వంశీ ప్రకటించారు.
దేవినేని ఉమా కోరుకున్న మీడియా డిబేట్ కు తాను , కొడాలి నానీ వస్తామని అక్కడ తేల్చుకుందాం అని వల్లభనేని వంశీ ప్రకటించారు.

గొల్లపూడి వెళ్ళిన వల్లభనేని వంశీ .. మరోమారు ఉద్రిక్తత
గొల్లపూడిలో దీక్ష చేయడానికి ప్రయత్నించిన దేవినేని ఉమ ను పోలీసులు అరెస్టు చేసిన కొద్దిసేపటికే, గొల్లపూడి లోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు వల్లభనేని వంశీ .దీంతో అక్కడ అప్పటికే భారీగా మోహరించిన టీడీపీ నేతలు వల్లభనేని వంశీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొడాలి నానికి మద్దతుగా అక్కడికి వచ్చిన వైసీపీ నేతలు, అలాగే వల్లభనేని వంశీ అనుయాయులు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ మరోమారు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.

ర్యాలీగా చేరుకున్నఎంపీ నందిగం సురేష్ , మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ప్రస్తుతం ఏపీలో టీడీపీ , వైసీపీ నాయకుల సవాళ్లు , ప్రతి సవాళ్ళతో ఆందోళన నెలకొంది .
మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ లు కూడా గొల్లపూడి లోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకోవడంతో పోలీసులు వారిని సైతం అడ్డుకున్నారు. కొడాలి నానికి, దేవినేని ఉమా కి మధ్య ఏమైనా ఉంటే వారు తేల్చుకోవాలన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.మధ్యలో సీఎం జగన్మోహన్ రెడ్డిని లాగి విమర్శలు చేస్తే చూస్తూ సహించేది లేదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు . ఎంపీ నందిగం సురేష్ సైతం దేవినేని ఉమా పై తీవ్రంగా మండిపడ్డారు. కావాలనే ఇదంతా దేవినేని ఆడుతున్న హైడ్రామా గా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.