బూతుల మంత్రి అన్నా ఐ డోంట్ కేర్ , సీఎం జగన్ జోలికొస్తే ఊరుకోను .. కొడాలి నాని
ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. జగన్ ఒక్క మాట అంటే అన్న వారిని తిరిగి పది మాటలు అంటామన్నారు మంత్రి కొడాలి నాని. జగన్మోహన్ రెడ్డికి అంగుళం దిగితే, మీకు అడుగు దిగుతుంది అంటూ టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బూతుల మంత్రి అని, బోషాణం మంత్రి అనో ఎవరెన్ని మాట్లాడినా లెక్క చేసేది లేదు ఐ డోంట్ కేర్ అని తేల్చి చెప్పారు కొడాలి నాని.

జగన్ జోలికొస్తే ఊరుకోను
నందివాడ మండలం లక్ష్మీ నరసింహపురంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని మరోమారు తనపై వస్తున్న విమర్శలపై రివర్స్ ఎటాక్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని పేర్కొన్న కొడాలి నాని ఆయన జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడి ఆశీస్సులు, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సుల తో పాటు ప్రజల ఆశీస్సులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటూ, సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు సాగుతున్న సీఎంను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

వాళ్ళెంత వాళ్ళ బతుకులెంత కొడాలి నానీ ఫైర్
జగన్ వెనుక తాము ఉన్నామన్న ఆక్రోశంతోనే కొందరు ఇష్టమొచ్చినట్టు తన గురించి ప్రచారం చేస్తున్నారని, వాళ్ల గురించి తాను పట్టించుకోనని అన్నారు కొడాలి నాని.
కొన్ని మీడియా చానళ్లలో తన ఫోటో పెట్టుకొని, ఏళ్ల తరబడి వార్తలు వేసుకున్నా తనకు అభ్యంతరం లేదని, ఎవరిష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు అంటూ నాని పేర్కొన్నారు. వాళ్ళెంత వాళ్ళ బతుకులెంత అంటూ నిప్పులు చెరిగారు. రాజకీయంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి అంగుళం హాని తలపెడితే, వారికి అడుగు దిగుతుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

బూతుల మంత్రి అన్నా సరే ఐ డోంట్ కేర్
టిడిపి తొట్టి గ్యాంగ్ ను తాను పట్టించుకోనని కొడాలి నాని స్పష్టం చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేక ఆయనపై రాళ్లు వేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబును , లోకేష్ ను విమర్శిస్తే బూతుల మంత్రి అంటున్నారని, అయినా తాను లెక్క చేయనన్నారు కొడాలి నాని. సీఎం జగన్ పది కాలాలపాటు చల్లగా ఉండాలని, పేద ,బడుగు, బలహీన వర్గాలకు ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ఆయనపై విమర్శలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ఎవరేం చేసినా లెక్క చేయనని తనదైన స్టైల్లో కొడాలి నాని తేల్చిపారేశారు.