‘బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానాలున్నాయి.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తా’
అమరావతి: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై అటు జనసేన, ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శల దాడి కొనసాగుతోంది. తాజాగా, అధికార వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు బాలకృష్ణ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బాలకృష్ణ మానసిక స్థితిపై ప్రభుత్వానికి..
శుక్రవారం కోరుముట్ల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లతాడుతున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేదని గతంలో డాక్టర్లు చెప్పారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ మానసిక పరిస్థితిపై అనుమానాలు కలుగుతున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు.

అలాంటి చంద్రబాబును బాలయ్య భుజానా మోస్తూ..
బాలకృష్ణకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని ఆయన అన్నారు. బాలయ్య తీరుతో హిందూపురం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అయితే, దివంగత నేత ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణపై అందరికీ అభిమానం ఉందన్నారు. కానీ, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును బాలకృష్ణ భుజాన మోస్తున్నారని విమర్శించారు.

నాలుగేళ్లలో జగన్ ఇంకెన్నో అద్భుతాలు
చంద్రబాబు చచ్చిన పాము వంటివాడని ఎమ్మెల్యే కోరుముట్ల ఎద్దేవా చేశారు. చంద్రబాబు జూమ్ బాబుగా మారిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాదిలోనే దేశంలో అత్యంత ప్రజాదరణ
పొందిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని కోరుముట్ల వ్యాఖ్యానించారు. తొలి ఏడాదిలోని అద్భుతాలు సృష్టించారని అన్నారు. రానున్న నాలుగేళ్లలో ఇంకా ఎలాంటి అద్భుతాలు చేస్తారో టీడీపీ నేతలు చూడాలన్నారు. ఇటీవల జనసేన నేత నాగబాబు కూడా బాలయ్యపై తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ను సినీ పెద్దలు కలిసిన నేపథ్యంలో బాలయ్యకు ఆహ్వానం అందలేదనే విషయంలో బాలయ్య వ్యాఖ్యలనుద్దేశించి విమర్శించారు. సినీ పరిశ్రమలో మీరొక నటుడు మాత్రమే మీరే ఇండస్ట్రీ కాదంటూ చురకలంటించారు. దీనికి బాలయ్య కూడా ఘాటుగానే స్పందించారు. తనతో ఎవరైనా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.