డీజీపీ చెప్పింది నిజమే .. బండారం బయటపడుతుంటే నారా వారి నరాల్లో వణుకు : చంద్రబాబు పై మంత్రి అనిల్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాల పై జరుగుతున్న దాడులకు,విగ్రహం విధ్వంసాలకు వెనుక రాజకీయ ప్రమేయం ఉందని, టిడిపి ,బిజెపి నేతల హస్తం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దీంతో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పిన విషయాలను సమర్థిస్తూ, టిడిపి నేతలపై మండిపడ్డారు.

ఏపీలో విధ్వంసానికి కారణం చంద్రబాబే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసానికి చంద్రబాబే కారణం అంటూ పేర్కొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. క్షుద్ర పూజలు చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందంటూ విమర్శించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలను కూలగొట్టిన చరిత్ర కూడా చంద్రబాబుదే అంటూ ఫైర్ అయ్యారు.
దేవాలయాల పై జరుగుతున్న దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఇచ్చిన వివరణ స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

విగ్రహాలు పగలగొట్టినా పర్వాలేదు కానీ నిజాలు బయటకు రాకూడదని చంద్రబాబు ప్రయత్నం
ఇందులో టిడిపి హస్తం ఉందన్న విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయంతో దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. కులాలు,మతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదని అసహనం వ్యక్తం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. విగ్రహాలు పగలగొట్టినా పర్వాలేదు కానీ నిజాలు బయటకు రాకూడదు అని తెగ ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాజకీయాల కోసం దురుద్దేశంతో ఇవన్నీ చేశారని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.

కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా .. ప్రశ్నించిన మంత్రి అనిల్
కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా అంటూ ప్రశ్నించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దురుద్దేశం మీకుందా... మాకు ఉందా ? చెప్పాలని ప్రశ్నించారు. అఖిలప్రియ కేసులో ఇంతవరకు స్పందించని వారు ఆలయాల పై జరిగిన దాడుల విషయంలో 9 కేసులపై మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజమండ్రి వినాయక విగ్రహానికి అపవిత్రం చేశారన్న కేసులో బుచ్చయ్యచౌదరి అనుచరులు కాదా ఉంది అంటూ ప్రశ్నించారు .

దుర్గగుడిలో క్షుద్రపూజలు చేసినట్లు చరిత్ర చంద్రబాబుదన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్
దుర్గగుడిలో క్షుద్రపూజలు చేసినట్లు చరిత్ర చంద్రబాబుదని ఈ వాస్తవాలు బయటకు వస్తుంటే నారావారి నరాల్లో వణుకు పుడుతుంది అంటూ విమర్శించారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అని మాపై దాడి చేసే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. భగవంతుడితో ఆడుకున్న వాళ్ళు ఎవరూ బాగు పడినట్లు చరిత్రలో లేదని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.