టీడీపీవి చిల్లర రాజకీయాలు .. దమ్ముంటే ఆ పని చెయ్యండి : మంత్రి అనీల్ కుమార్ యాదవ్
టిడిపి నేతలపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే అడ్డుపడిన టిడిపినే ఇప్పుడు పేదలకు ఇళ్లు ఇవ్వడం లేదంటూ రోడ్డెక్కి చిల్లర రాజకీయాలు చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు సిగ్గుమాలిన చర్యలకు దిగుతున్నారని, అవసరం అనుకుంటే మహిళలతో టీడీపీకి వ్యతిరేకంగా మహిళలతో ఆందోళన చేయిస్తాం అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చిన తీరుతామని పేర్కొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు డివిజన్ లో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
టిడిపి నాయకులు, చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుల్లో కేసులు వేయించారని, దమ్ముంటే ఆ కేసులను వెనక్కి తీసుకోమని మీ చంద్రబాబుకు చెప్పండి అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

అలా కాకుండా పేదలకు ఇచ్చే వాటిని రాకుండా అడ్డుకొని, ఇప్పుడు టిడ్కో గృహాలను పేదలకు ఇవ్వాలంటూ చంద్రబాబు ఆందోళనకు పిలుపునివ్వడం, తగుదునమ్మా అంటూ టిడిపి నేతలు ఆందోళన చేయడం సిగ్గుమాలిన చర్య అంటూ అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
మరోవైపు టీడీపీ నేతలు నిరుపేదలకు ఇళ్ళు ఇవ్వకుండా వైసీపీ సర్కార్ మోసం చేసిందని ఆరోపిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చారు. అంతేకాదు సంక్రాంతిలోపు టిడ్కో గృహాలను పేదలైన లబ్దిదారులకు అందించాలని డిమాండ్ చేసి అలా వీలు కాకుంటే తామే పేదలకు ఇళ్ళు స్వాధీనం చేస్తామని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే మంత్రి అనీల్ కుమార్ యాదవ్ టీడీపీ నేతలపై మండిపడుతున్నారు .