గవర్నర్‌కే సలహా ఇచ్చే నిపుణుడా.. గతంలో ఎన్టీఆర్‌కు మైక్ కూడా ఇవ్వలే: యనమలపై కన్నబాబు..
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. దీనిపై గవర్నర్ న్యాయ సలహా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. యనమల కామెంట్లను మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ అవసరమని నిపుణులు చెప్పారని గుర్తుచేశారు.

తెలియదా..? యనమల...
టీడీపీ నేతలకు నిపుణుల కమిటీ చెప్పింది అర్థం కాలేదని విమర్శించారు. వారి అధినేత చంద్రబాబు మాదిరిగా యనమల కొత్త అంశాలు తెరపైకి తెస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమల రాజ్యాంగం గురించి మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రెండోసారి మండలిలో బిల్లులు పెట్టి నెలరోజులైనందున వాటిని అసెంబ్లీ అధికారులు నిబంధనల ప్రకారం గవర్నర్‌కు పంపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 197(2) ప్రకారం మండలిలో రెండోసారి బిల్లులు ప్రవేశపెట్టిన నెలరోజుల తర్వాత అవి ఆటోమేటిగా ఆమోదం పొందుతాయన్నది యనమలకు తెలియదా అని కన్నబాబు ప్రశ్నించారు.

ఎన్టీఆర్‌కు మైక్ ఇవ్వలే
ఏనాడూ రాజ్యాంగ నిబంధనలను పాటించని యనమల అని విమర్శించారు. గతంలో ఎన్టీఆర్‌కు అసెంబ్లీలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వని వ్యక్తి, కూడా ఆయనే అని గురతుచేశారు. అప్పటినుంచి చంద్రబాబును కాపాడేందుకు తపన పడే వ్యక్తుల్లో యనమల ముందుంటారని చెప్పారు. కానీ నేడు రాజ్యాంగ నిపుణుడైన గవర్నర్‌కు సలహా ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ నేతల బినామీ భూములను, నాయకుల ఆస్తులను, సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకే ప్రేమ అని కన్నాబాబు ఆరోపించారు.

కాలం వెళ్లదీశారు..
గత ప్రభుత్వ హయాంలో అమరావతికి చేసిందేంటి అని కన్నబాబు ప్రశ్నించారు. తాత్కాలిక భవనాలు తప్ప చేసిందేమీ లేదు అని మండిపడ్డారు. భూములు బలవంతంగా లాక్కున్నారని.. వారికి ప్లాట్లు ఇవ్వలేదన్నారు. ప్రకాశం బ్యారేజిపై డబుల్ లైన్ కూడా వేయలేని చంద్రబాబు మహానగరం గురించి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. 54 వేల మంది పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలను తమ ప్రభుత్వం ఇస్తుంటే ఓర్వలేని స్థితిలో టీడీపీ నేతలు ఉన్నారని చెప్పారు.