ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన జననేతకు సలాం.. వీరాభిమానం చాటుకున్న మంత్రి కొడాలి నానీ
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొడాలి నానీ తనదైన శైలిలో ప్రశంసించారు. ఎంపీ గా మొదలైన రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో చెప్పి జగన్ మోహన్ రెడ్డికి జేజేలు పలికారు. సోషల్ మీడియా వేదికగా తన అభిమానాన్ని చాటుకున్న కొడాలి నానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుండి , తండ్రి మరణం, ఎన్నో కుట్రలు, సూటిపోటి మాటలు, విష ప్రచారాలు అన్నింటిని తట్టుకొని నిలబడ్డారని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ పదేళ్లుగా ప్రజల ముందుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. అలా జనాల గుండెల్లో నిలిచిపోయిన జననేతకు సలాం అని కొడాలి నాని అన్నారు.
వాళ్లకు సిగ్గు శరం లేదు .. మామూలు భాష అర్ధం కాదు .. టీడీపీ నేతలపై కొడాలి నానీ ఘాటు వ్యాఖ్యలు

జగన్ పై ,వైఎస్సార్ పై అభిమానం చాటుకున్న కొడాలి నానీ
ఇక మరో పోస్ట్ లో కొడాలి నానీ నా ఫేస్ బుక్, ట్విట్టర్ ల ద్వారా నన్ను చాలా మంది అడుగుతున్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు ఎప్పుడూ వైఎస్సార్ ని విమర్శించలేదా అని? వాళ్ళందరికీ
ఒకటే చెప్తున్నా అని చేసిన పోస్ట్ లో ఆయన ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. ఒక హిందూ హిందూ దేవుళ్లను పూజిస్తారు. ఒక ముస్లిం అల్లానే నమ్ముతాడు .ఒక క్రిస్టియన్ ఏసుక్రీస్తుని ప్రార్థిస్తాడు. కానీ కులం, మతం, ప్రాంతం, పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆరాధించేది ఆ మహానేత వైఎస్ఆర్ ని మాత్రమే అని మహానేత వైయస్ఆర్ పై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు కొడాలి నాని.

నా ఆరాధ్య దైవం వైయస్సార్ అన్న మంత్రి కొడాలి నానీ
ఇక అంతే కాదు నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి.. మా నాన్నకు గుండె జబ్బు నయం కావాలి.. ఇలా ఏదైనా కావాలంటే ఆ దేవుడ్ని అడిగితే ఇస్తాడు కానీ ఇలా అవన్నీ అడగకుండా ఇచ్చిన ఆ మహానుభావుడిని ఎలా మర్చిపోగలం.. గుండెల్లో కట్టుకొని పూజిస్తాం అంటూ తనకు వైఎస్సార్ పై ఉన్న వీరాభిమానం చెప్పారు. నా ఆరాధ్య దైవం వైయస్సార్ అని చెప్పారు. కొంతకాలంగా టీడీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా టిడిపిలో ఉన్నప్పుడు ఎప్పుడు వైయస్సార్ ను విమర్శించే లేదా అని ప్రశ్నలు సంధిస్తున్నారు.

వైఎస్ దేవుడయ్యాడు అని ప్రశ్నించిన పకోడీ గాళ్లకు ఇదే సమాధానం అన్న మంత్రి
పార్టీ మారగానే వైఎస్ దేవుడయ్యాడు అని ప్రశ్నించిన పకోడీ గాళ్లకు తాను ఒకటే చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చిన కొడాలి నాని రాజకీయ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ తాను ఎప్పుడూ వైయస్సార్ గారి ని విమర్శించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు ఎవరు ఎంత వెతికినా ఒక పేపర్ కటింగ్ కానీ, ఓ వీడియో క్లిప్పింగ్ కానీ దొరకవని తేల్చిచెప్పారు. అంతేకాదు తాను టిడిపిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సైతం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా గుడివాడ నియోజకవర్గానికి నిధుల కేటాయింపుల విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయలేదని, అది ఆ మహానుభావుడి గొప్పతనం అని పేర్కొన్నారు.

పదేళ్లుగా ఫోన్ వాల్ పేపర్ మీద మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉందన్న నానీ
గత పదేళ్లుగా తన ఫోన్ వాల్ పేపర్ మీద మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖచిత్రం మాత్రమే ఉందని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కంఠంలో ప్రాణమున్నంత వరకూ తన చివరి కట్టె కాలే వరకు రాజన్న గుర్తుగా జగనన్నతోనే ప్రయాణం అంటూ గతంలో ఆయన రాసిన లేఖను తిరిగి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు కొడాలి నాని. మొత్తానికి జగన్ మీద అభిమానం ప్రదర్శిస్తూ వరుస ట్వీట్స్ చేశారు.