జైలుకు వెళ్లిన అర్హత ఉంటేనే సీఎం చేస్తారు: ప్రజలు అదే నిరూపించారు: అశోక్‌బాబు వ్యాఖ్యల కలకలం
టీడీపీ ఎమ్మెల్సీ..ఏపీ ఎన్టీఓ సంఘ మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఏపీకీ ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వారు జైలుకు వెళ్లిన అర్హత ఉండాలని ప్రజలే తమ ఓట్ల ద్వారా నిరూపించారంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పైన అవినీతి ముద్ర వేసేందుకే జగన్ విచారణ ప్రారంభించారని..ఆ అవినీతిలో అధికారులే కీలక పాత్ర ఉంటుందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఇప్పుడు అశోక్‌బాబు చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు ఫైర్ అవుతు న్నారు. ఉద్యోగసంఘ నాయకుడిగా ఉన్న సమయం నుండి అశోక్‌బాబు టీడీపీకి అనుకూలంగానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల్లో ఓటర్ల తీర్పు పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.
కూలుస్తారా..కూల్చమంటారా: చంద్రబాబు-లింగమనేని నివాసమే నెక్స్ట్: షోకాజ్ నోటీసులు..!

సీఎం కావాలా..జైలుకు వెళ్లి రావాలి..
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసారు. దీని పైన ఒక టీవీ చర్చలో టీడీపీ ప్రతినిధిగా పాల్గొన్న అశోక్‌బాబు ఈ రకమైన వ్యాఖ్యలు చేసారు. ఏపీకీ ముఖ్యమంత్రి కావాలంటే జైలు జీవితం గడిపిన అర్హత ఉండాలనే విధంగా తాజా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానిం చారు. అశోక్‌బాబు ఎక్కడా ముఖ్యమంత్రి జగన్ పేరు ప్రస్తావించకపోయినా..ఆ వ్యాఖ్యలు జగన్‌ను ఉద్దేశించి చేసినవిగా భావిస్తున్నారు. టీడీపీ ముఖ్య నేతలు సైతం ఎన్నికల ఫలితాల పైన ఈ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. అశోక్‌బాబు రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం పోరాడినా..ఆయన పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లోనే పని చేసారనే ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన తీరు పైన అనేక విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ప్రజా తీర్పు పైనే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబును జైలుకు పంపాలనే..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఏదో రకంగా అవినీతి ముద్ర వేసి ప్రజల్లో ఆయనను అవినీతి చేసారనే విధంగా నిలబెట్టాలనేదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. ఏదో విధంగా బాబును జైలుకు పంపాలని జగన్ చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో మంత్రుల కంటే అధికారుల పాత్రే ఎక్కువగా ఉంటుందని వివరించారు. మరి అధికారులను కూడా జైలుకు పంపుతారా అని ఆయన ప్రశ్నించారు.
ఏదైనా అంశంలో అవినీతి జరిగితే దాని పైన న్యాయ విచారణ కమిటీని వేయాలని..అంతే గాని పాలన మొత్తం అవినీతి మయం అని చెప్పటం సరి కాదన్నారు. గతంలో జగన్ తండ్రి వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే రకంగా చంద్రబాబు పైన విచారణ కమిటీలు వేసినా ఏమీ చేయలేకపోయారని గుర్తు చేసారు. ఇప్పుడు జగన్ కూడా అంతే అంటూ వ్యాఖ్యానించారు. అయితే, అశోక్‌బాబు మాట్లాడిన తీరు మాత్రం వివాదాస్పదంగా మారింది. దీని పైన ఇప్పుడు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారేది చూడాలి.

చంద్రబాబుకు వీర విధేయుడిగా..
రాష్ట్ర విభజన సమయం నుండి ఏపీఎన్జీఓ సంఘ అధ్యక్షుడిగా ఉన్న అశోక్‌బాబు మీద నాటి నుండి ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఉద్యోగ సంఘాల నేతగా ఉద్యోగుల ప్రయోజనాల కంటే టీడీపీ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఎక్కువగా పని చేసారని వైసీపీ..బీజేపీ నేతల ఆరోపిస్తూ ఉంటారు. కర్నాటక ఎన్నికల సమయంలోనూ బీజేపీని ఓడించాంటూ ఉద్యోగ సంఘ నేతగా ఉంటూనే ప్రచారం చేసారు. అశోక్‌బాబు విద్యార్హత మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక, టీడీపీలో సీనియర్లను కాదని..చంద్రబాబు తనకు విధేయుడిగా ఉంటూ వచ్చిన అశోక్‌బాబుకు ఎమ్మెల్సీ అప్పగించారు. ఈ మధ్య కాలంలో టీవీ చర్చల్లో టీడీపీ ప్రతినిధిగా ఎక్కువగా పాల్గొంటున్నారు. ఇప్పుడు జైలు..సీఎంగా అర్హత అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పైన చర్చ మొదలైంది. దీనిని వైసీపీ నేతలు సీరియస్‌గా తీసుకుంటున్నారు.