పార్ధసారధి దీక్షకు నో పర్మిషన్ .. సొంత పార్టీ ఎమ్మెల్యేకు వైసీపీ సర్కార్ షాక్
ఏపీలో ఇసుక కోసం రసవత్తర పోరాటం సాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల విమర్శలు , ప్రతివిమర్శలు, సవాళ్లు , ప్రతిసవాళ్ళతో ఏపీ అట్టుడుకిపోతుంది. ఎవరికి వారు ఏ మాత్రం తగ్గటం లేదు . తాజాగా పార్థసారధి వర్సెస్ చంద్రబాబు రగడ కొనసాగుతుంది. చంద్రబాబు ఇసుక దీక్ష చెయ్యనుండగా, అక్కడే తానూ దీక్ష చేస్తానని చెప్పి సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి నేడు బాబు దీక్ష సందర్భంగా ఏం చెయ్యనున్నారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఏపీలో ఇసుక రాజకీయం ... చంద్రబాబు ఇసుక దీక్ష వర్సెస్ ఇసుక వారోత్సవాలు

చంద్రబాబు దీక్ష పక్కనే తాను కూడా దీక్షకు దిగుతానన్న వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి
ఇసుక కొరతకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు నేడు విజయవాడలోని ధర్నా చౌక్ లో ఇసుక దీక్ష చేస్తున్నారు. అయితే చంద్రబాబు దీక్షకు పోటీగా వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి దీక్షకు దిగాలని నిర్ణయించారు. తనను ఇసుక అక్రమ రవాణా కేసులో ఇరికిస్తూ టీడీపీ ఛార్జి షీటు విడుదల చేసిందని, తగిన ఆధారాలు చూపాలని డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి నిన్న సాయంత్రంలోగా తగిన ఆధారాలు చూపించకపోతే నేడు చంద్రబాబు దీక్ష పక్కనే తాను కూడా దీక్షకు దిగుతానని చెప్పారు.

విజయవాడ పోలీస్ కమిషనర్ కు అనుమతి కోసం లేఖ... అనుమతి నిరాకరణ
ఈ మేరకు ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. హోం మంత్రిని ,పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. తనకు కూడా దీక్ష చేసేందుకు ధర్నా చౌక్ లో అనుమతించాలని కోరుతూ పార్థసారధి పోలీస్ కమిషనర్ కు పర్మిషన్ కోసం లేఖ రాశారు. అయితే పార్థసారథి దీక్షకు అనుమతి నిరాకరించి పోలీసులు షాక్ ఇచ్చారు. ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వద్దు అన్న కారణంగానే ప్రభుత్వం పార్థసారథి దీక్షకు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది.

నేడు కొనసాగుతున్న చంద్రబాబు దీక్ష .. పార్థసారధికి మాత్రం షాక్
ఏపీలో ఇసుక కొరతకు నిరసనగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడలో 12గంటల దీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన చంద్రబాబు దీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. ఇక ఈ దీక్షకు జనసేన, సీపీఐ, సీపీఎం, ఆప్ పార్టీలు సంఘీభావాన్ని తెలిపాయి. చంద్రబాబు చేపట్టిన దీక్షకు పోటీగా తాను కూడా దీక్ష చేపడతానని చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి సొంత పార్టీకి చెందిన ప్రభుత్వమే షాకిచ్చింది.

సొంత పార్టీ నేతకే అనుమతి లేదని చెప్పిన వైసీపీ ప్రభుత్వం
చంద్రబాబు కు పోటీగా దీక్ష చేస్తానన్న పార్థసారధి దీక్షకు అనుమతి ఇవ్వకుండా వైసీపీ సర్కార్ కుదరదని తేల్చేసింది. అయితే పార్థసారథి మాత్రం ఇసుక దాచానని చంద్రబాబు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దాచిన ఇసుకతో ఏం పనులు చేశానో వాటిపై బాబు ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. మొత్తానికి పార్థసారథి దీక్షకు అనుమతి ఇచ్చి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవి కాబట్టే అనుమతి నిరాకరించి ఏపీ ప్రభుత్వం ఉద్రిక్త పరిస్థితులు నివారించింది అని చెప్పొచ్చు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!