AP CS LV Subrahmanyam: మళ్ల వార్తలోకెక్కిన జెరూసలేం మత్తయ్య: ఎల్వీ సుబ్రహ్మణ్యం.. బీజేపీ ఏజెంట్..!
అమరావతి: ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొన్న వివాదాస్పద క్రైస్తవ ఉపన్యాసకుడు జెరూసలేం మత్తయ్య మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాదు.. ఆయన బదిలీ కావడం పట్ల కేక్ కట్ చేసి మరీ వేడుకలు జరుపుకొన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీకి తామే కారణమని అన్నారు. క్రైస్తవ సమాజం చేసిన ప్రార్థనలు ఫలించాయని, అందువల్లే ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారని చెప్పారు. ఆయనను బదిలీ చేయడం పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏజెంట్.. ఎల్వీ
ఎల్వీ సుబ్రహ్మణ్యం బీజేపీ ఏజెంట్ అని మత్తయ్య ఆరోపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), బీజేపీ సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా ఆయన పరిపాలించారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సైతం తప్పుదారి పట్టించారని విమర్శించారు. బీజేపీ నాయకులు ఆదేశించడం వల్లే ఎల్వీ సుబ్రహ్మణ్యం క్రైస్తవులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని, వారిని ఇబ్బందులు పెట్టేలా జీవోలను జారీ చేశారని విమర్శించారు. దేవాదాయ శాఖలో అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రధాన కారణమని అన్నారు.

టీడీపీ అనుకూలుడిగా..
అన్యమత ఉద్యోగుల తొలగింపు వ్యవహారంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని, ఆయనను పక్కదారి పట్టించారని జెరూసలేం మత్తయ్య వ్యాఖ్యానించారు. ఎల్వీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను తప్పించాలని కోరుతూ తాము ఇదివరకే బహిరంగంగా వైఎస్ జగన్ ను కోరామని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో జెరూసలేం మత్తయ్య పేరు వినిపించిన విషయం తెలిసిందే. మత్తయ్య ద్వారానే నాటి తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో సంబంధాలు కలుపుకోగలిగిందంటూ అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.

ఓటుకు నోటు కేసులో.. విజయవాడలో..
ఓటుకు నోటు కేసులో మత్తయ్యను అరెస్టు చేయడానికి తెలంగాణ పోలీసులు అరెస్టు వారెంట్ ను జారీ చేయగా.. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు పారిపోయినట్లు వచ్చిన విషయం తెలిసిందే. విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆశ్రయంలో తలదాచుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం ఓటుకు నోటు కేసు వ్యవహారంలో రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఎదురు కావడంతో తాను లొంగిపోతానంటూ ప్రకటించారు గానీ.. ఆ పని చేయలేదని, నాటి తెలుగుదేశం ప్రభుత్వ సంరక్షణలో చాలాకాలం పాటు గడిపారనే విమర్శలు మత్తయ్యపై వెల్లువెత్తాయి. ఆ తరువాత చాలాకాలం పాటు స్తబ్దుగా ఉన్న మత్తయ్య తాజాగా ఎల్వీ సుబ్రహ్మణ్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వెలుగులోకి వచ్చారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!