తిరిగొస్తాను... మాణిక్యాలరావు చివరి ట్వీట్ ఇదే.. స్పందించిన పవన్,చిరు..
మాజీ మంత్రి,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో మృతి చెందడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన మృతిపై స్పందించారు. మాణిక్యాలరావు తుదిశ్వాస విడిచారని తెలిసి విచారానికి లోనయ్యానని తెలిపారు.
మాణిక్యాలరావు మరణంతో ఒక సైద్దాంతిక నిబద్దత కలిగిన నేతను కోల్పోయామన్నారు. పార్టీకి,ప్రజలకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారన్నారు. తాడేపల్లిగూడెంలో పలు సందర్భాల్లో జనసేన కార్యకర్తలకు అండగా నిలిచారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోలుకుంటారని భావించామన్నారు.మాణిక్యాలరావు మరణం తాడేపల్లిగూడెం వాసులకే కాదని, ఏపీ ప్రజలందరికీ తీరని లోటు అని పేర్కొన్నారు.

మాణిక్యాలరావు మృతిపై టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి చిరంజీవి కూడా స్పందించారు. ఆయన మరణ వార్త విని విషాదానికి లోనయ్యానని ట్వీట్ చేశారు. సామాన్యుడిలా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పలు కీలక పదవులు చేపట్టారని అన్నారు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాణిక్యాలరావు మరణంపై ట్విట్టర్లో స్పందించారు. ఆయన అకాల మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. దశాబ్దాల పాటు బీజేపీకి విశేష సేవలు చేశారని, మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించారని గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. రాష్ట్ర మాజీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా మాణిక్యాలరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కరోనాను జయించి ఆసుపత్రి నుంచి తిరిగి వస్తారని భావించామని,ఆయన మరణం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాణిక్యాలరావు చివరి ట్వీట్ ఇదే...
జూలై 25న ట్విట్టర్లో మాణిక్యాలరావు చివరి ట్వీట్ చేశారు. తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను నమ్మవద్దని,కంగారుపడవద్దని,అధైర్య పడవద్దని చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. మీ అందరి ఆదరాభిమానాలతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తానని చెప్పారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడం రాష్ట్ర బీజేపీ వర్గాలను విషాదంలో ముంచింది.
నా ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులు ఎవరు నమ్మవద్దు.కంగారు పడవద్దు,అధైర్య పడవద్దు. నేను ఆరోగ్యంగానే వున్నా. భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో నేను పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను.
— Pydikondala Manikyala Rao (@UrsPMR) July 25, 2020