• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మూడు రాజధానులపై సైలెన్స్‌- మున్సిపోల్స్‌లో వైసీపీ, టీడీపీ మౌనం- షాకింగ్‌ రీజన్స్‌

|

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోరులో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీ ప్రచారం సాగిస్తున్నాయి. అంగబలం, అర్ధబలంతో పురపాలక పోరులో సత్తా చాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో చేసిన తప్పిదాలపై పరస్పరం బురదజల్లుకుంటున్నాయి. కానీ ఇందులో ఎక్కడా మూడు రాజధానుల ప్రస్తావన మాత్రం తీసుకురావడం లేదు. కానీ అంతర్గతంగా మాత్రం ఈ వ్యవహారాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వైసీపీ, టీడీపీ మూడు రాజధానులపై వ్యూహాత్మక మౌనం పాటించడం వెనుక ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి.

మూడు రాజధానులపై గతంలో అమీతుమీ

మూడు రాజధానులపై గతంలో అమీతుమీ

ఏపీలో వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు 2019 డిసెంబర్లో సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రకటన చేయగానే టీడీపీ భగ్గుమంది. అమరావతిని కాదని మూడు రాజధానులను ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించింది. విపక్ష నేత చంద్రబాబు అమరావతికి మద్దతుగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు నడిపారు. అయినా వైసీపీ సర్కారు వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ వేదికగా బలనిరూపణకు దిగింది. అయితే సహజంగానే అసెంబ్లీలో భారీమెజారిటీతో ఉన్న వైసీపీ బిల్లులను ఆమోదింపచేసుకుంది. ఆ తర్వాత గవర్నర్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేయడంతో టీడీపీ ఇక న్యాయపోరాటానికి తెరలేపింది. అమరావతి రైతులతో వరుస పిటిషన్లు వేయించింది. అయితే విచారణ చివరి దశకు చేరుకున్న తరుణంలో హైకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ బదిలీతో ఈ వ్యవహారం మొదటికొచ్చింది. తిరిగి విచారణ ప్రారంభం కావడం నానాటికీ ఆలస్యమవుతోంది. కానీ వైసీపీ సర్కారు మాత్రం ఎప్పటికప్పుడు త్వరలో రాజధాని తరలింపు అని చెప్పుకుంటూ కాలం గడిపేస్తోంది.

మున్సిపోల్స్‌లో రాజధానులపై వైసీపీ, టీడీపీ మౌనం

మున్సిపోల్స్‌లో రాజధానులపై వైసీపీ, టీడీపీ మౌనం

ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల పోరులో మూడు రాజధానులపై వైసీపీ, టీడీపీ అమీతుమీ తేల్చుకుంటాయని అంతా భావించారు. మూడు రాజధానుల ఏర్పాటుతో ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పుకున్న వైసీపీ కానీ, అమరావతి స్ధానంలో మూడు రాజధానులతో వినాశనం తప్పదని ఊదరగొట్టిన టీడీపీ కానీ ఇప్పుడు దీనిపై మాట్లాడేందుకు సిద్ధం కావడం లేదు. ఓ దశలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్ని రాజధానులకు రిఫరెండంగా తీసుకోవాలని టీడీపీ కోరుతుందని భావించినా అలా జరగలేదు. అలాగని వైసీపీ కూడా రాజధానుల వ్యవహారాన్ని వాడుకుని మూడు ప్రాంతాల్లోని నాలుగు కార్పోరేషన్ల అజెండాగా మార్చుకుంటుందని భావించినా అదేమీ కనిపించడం లేదు. దీంతో మూడు రాజధానుల పేరెత్తకుండానే మున్సిపల్‌ ఎన్నికల పోరు సాగిపోతోంది.

మూడు రాజధానులపై వైసీపీ మౌనం వెనుక ?

మూడు రాజధానులపై వైసీపీ మౌనం వెనుక ?

మూడు రాజధానులపై వైసీపీ మౌనం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అధికార వికేంద్రీకరణతో అందరికీ న్యాయం జరుగుతుందని బలంగా వాదించి, ఆ మేరకు జీఎస్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్‌తో నివేదికలు కూడా ఇప్పించిన వైసీపీ ఇప్పుడు వ్యూహాత్మకంగా మౌనంగా ఉండిపోతోంది. అంటే తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల వ్యవహారాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు, వారి నాడి తెలుసుకునేందుకు అందివచ్చిన పోరులో వైసీపీ చేతులెత్తేసిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే మున్సిపల్‌ పోరులో రాజధానుల ప్రభావం ఉండే నాలుగు కార్పోరేషన్లు కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖల్లో వీటి ప్రస్తావన తెస్తే రెండు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. గుంటూరు, విజయవాడలో ఫలితాలను దృష్టిలో ఉంచుకునే వైసీపీ రాజధానుల వ్యవహారంపై స్పందంచడం లేదని అర్దమవుతోంది. అయితే కర్నూలు, విశాఖల్లో మాత్రం రాజధానులపై వైసీపీ అంతర్గతంగా ప్రచారం చేసుకుంటోంది.

 రాజధానులపై టీడీపీ మౌనానికి కారణాలివే ?

రాజధానులపై టీడీపీ మౌనానికి కారణాలివే ?

మూడు రాజధానుల ప్రక్రియను వైసీపీ ఎప్పుడైతే తెరపైకి తెచ్చిందో అప్పుడో టీడీపీ డిఫెన్స్‌లో పడిపోయింది. తాము అమరావతి ప్రాంతంపైనే దృష్టిపెట్టి అక్కడి ప్రజలను ఆకట్టుకుంటుంటే వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా కర్నూలు, విశాఖ రూపంలో మరో రెండు రాజధానులను వాటికి కలిపింది. దీంతో రాజధానులను వ్యతిరేకిస్తే కర్నూలు, విశాఖలో వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువకాలం అమరావతి ఉద్యమంలో టీడీపీ నేరుగా కొనసాగలేకపోయింది. కర్నూలు, విశాఖలో పెరుగుతున్న వ్యతిరేకత అమరావతిలో టీడీపీ చేతులు కట్టిపడేసింది. ఇప్పటికీ టీడీపీ పరిస్ధితి అదే. అమరావతికి వైసీపీ అన్యాయం చేసిందని ఆరోపిస్తే కర్నూలు, విశాఖకు న్యాయం చేసినట్లు ఒప్పుకోవాల్సి వస్తుందన్న భయం టీడీపీని వెంటాడుతోంది. దీంతో మున్సిపోల్స్‌లో తెలుగు తమ్ముళ్లు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. అయితే గుంటూరు, విజయవాడ కార్పోరేషన్లలో మాత్రం అంతర్గతంగా దీన్ని ప్రచారం చేసుకుంటున్నారు.

English summary
ruling ysrcp and opposition tdp maintains silence over formation plans of three capitals in ongoing municipal election campaign with some reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X