ఏపీ బీజేపీలో సోము ఒంటరిపోరు-సీనియర్ల సహాయనిరాకరణ-బండి సంజయ్‌వైపు చూపు
విభజన హామీల అమలులో వైఫల్యంతో ఏపీలో దాదాపు కనుమరుగైన బీజేపీకి తాజాగా చోటు చేసుకుంటున్న ఆలయాల విధ్వంసం ఘటనలు కొత్త ఊపిరినిచ్చాయి. మెజారిటీ హిందువుల పక్షాన నిలుస్తామంటూ ప్రకటనలు చేస్తూ ఆలయాల ఘటనలపై జగన్ సర్కారును టార్గెట్ చేస్తున్న సోము విర్రాజు పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయనకు పార్టీలో ఓ వర్గం నేతల నుంచి, అదీ సీనియర్ల నుంచి తగిన సహకారం లభించకపోవడంతో ఈ ప్రయత్నాలన్నీ వృథా అవుతున్నట్లు తెలుస్తోంది.
రేపు మరోసారి రామతీర్ధానికి సోము వీర్రాజు-త్వరలో రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు

బీజేపీకి కలిసొచ్చిన విగ్రహాల విధ్వంసం
ఏపీలో గత ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ అనంతర పరిస్ధితుల్లో జనసేనతో జత కట్టింది. అయినా ఏడాదిగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వీరిద్దరి పరిస్ధితి తయారైంది. ప్రభుత్వ విధానాలపై కేవలం విమర్శలకే పరిమితమవుతున్న బీజేపీ-జనసేన మిత్రద్వయానికి తాజాగా జరిగిన ఆలయాల్లో విగ్రహాల విధ్వంసం వ్యవహారం రాజకీయంగా కలిసొచ్చింది. జనసేన పరిస్ధితి ఎలా ఉన్నా బీజేపీకి మాత్రం ఓ రేంజ్లో వీటిని రాజకీయంగా వాడుకునే అవకాశం దొరికింది. అయితే బీజేపీ మరి దాన్ని వాడుకోగలుగుతందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి నెలకొంది.

సీనియర్ల సహాయనిరాకరణతో సోము ఒంటరిపోరు
గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణతో పోలిస్తే ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుకు ప్రభుత్వంపై గట్టిగా పోరు నడిపేందదుకు తగినన్ని అవకాశాలు లభించాయి. రాజధాని వ్యవహారం ఓవైపు, హైకోర్టు, ప్రభుత్వం మధ్య సాగుతున్న పోరు మరోవైపు, ప్రభుత్వ వైఫల్యాలు ఇంకోవైపు ఇలా ప్రతీ అంశంలోనూ బీజేపీకి సమర్ధంగా ప్రభుత్వాన్ని ఆడుకునే అవకాశం దొరికింది. వీటన్నంటికీ పరాకాష్టగా తాజాగా విగ్రహాల ధ్వంసం వ్యవహారం దొరికింది. మరి బీజేపీ వాటిని అందిపుచ్చుకుందా అంటే లేదని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు ఒంటరిపోరు. పార్టీలో గతంలో పదవులు వెలగబెట్టిన వారితో పాటు తాజాగా కమిటీల్లో స్ధానం దక్కించుకున్న కమ్మ సామాజిక వర్గ నేతలెవరూ సోముతో కలిసి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. దీంతో సీనియర్ నేతలెవరూ లేకుండానే సోము వీర్రాజు ఒంటరి పోరాటం కొనసాగుతోంది.

బీజేపీలో వర్గపోరుతో సోముకు చుక్కలు
ప్రస్తుతం ఏపీ బీజేపీలో రెండు, మూడు వర్గాలున్నాయి. వీరిలో గతంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన వారు, టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఎంపీలు, తాజాగా కమిటీల్లో చోటు దక్కించుకున్న కొత్త ముఖాలు.. ఇలా పలు వర్గాలున్నాయి. వీరిని ఏకతాటిపైకి తీసుకురావడంలో సోము వీర్రాజు విఫలమవుతున్నారు. దీనికి మరో కారణం ఏపీలో ఉండే సంక్షిష్టమైన కుల సమీకరణాలు. వరుసగా రెండోసారి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు అధ్యక్ష బాధ్యతలు దక్కడంతో మిగతా బలమైన సామాజిక వర్గాలు దీన్ని అంగీకరించే పరిస్ధితుల్లో లేనట్లే కనిపిస్తోంది. లేకపోతే అమరావతి కోసం ఉద్యమాలు చేసినప్పుడు కలిసొస్తున్న నేతలు ఆలయాల విధ్వంసంపై సాగుతున్న పోరు మైలేజ్ తెస్తుందని తెలిసీ మొహం చాటేయడం దేనికి నిదర్శమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సోము వైఫల్యాలతో బండి సంజయ్‌వైపు చూపులు
ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు పార్టీలో సీనియర్ల సహకారం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పార్టీకి అందివచ్చిన అవకాశాలను సైతం ఆయన వృథా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. తాజాగా బీజేపీ అధిష్టానంతో భేటీలోనూ ఇవే అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దీంతో సోము కంటే తెలంగాణలో బీజేపీని పరుగులు తీయిస్తున్న బండి సంజయ్‌పైనే అధిష్టానానికి విశ్వాసం పెరుగుతోంది. ఇప్పుడు ఆయన ఏకంగా తిరుపతి ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధమైపోతున్నారు. ఇలా పొరుగు రాష్ట్రాల ఉప ఎన్నిక ప్రచారానికి సిద్ధమైపోతున్న మరో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అరుదుగానే కనిపిస్తారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే సోము వైఫల్యాలతో బండి సంజయ్ తెలుగు రాష్ట్రాల బీజేపీని హోల్‌సేల్‌గా నడుపుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.