గేరు మారుస్తున్న సోము - బీజేపీలోకి చిరు, ముద్రగడ ? కాపు కార్డుపై సీరియస్గా దృష్టి..
ఏపీలో రెండు పార్టీలు, రెండు కులాలుగా సాగిపోతున్న రాజకీయాన్ని మరో మలుపు తిప్పేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగినా వాటిలో సీరియస్నెస్ కరువవడంతో అవన్నీ విఫలయత్నాలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ మరో ప్రయత్నం చేసేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తన సామాజిక వర్గం నుంచే ఈ ప్రయత్నం ప్రారంభించి త్వరలో దీనికి ఓ రూపు తీసుకురావాలని భావిస్తున్న సోము ఇందుకు పార్టీలోని ఇతర నేతలను కూడా ఒప్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది..

ఏపీ బీజేపీలో మార్పు....
ఏపీలో దశాబ్దాల క్రితమే కార్యకలాపాలు ప్రారంభించినా టీడీపీ నేతల చెప్పుచేతల్లోనే ఉండిపోయిన బీజేపీకి కేంద్రంలో మారిన పరిస్ధితులు కాస్త స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం కల్పించాయి. ముఖ్యంగా వెంకయ్యనాయుడు బీజేపీ బాధ్యతల నుంచి ఉపరాష్ట్రపతిగా మారాక మారిన పరిస్ధితుల్లో ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వం రావడం, ఆ తర్వాత కూడా టీడీపీ వాసనలు పోగొట్టుకోలేదని విమర్శలు ఎదుర్కొని తిరిగి సోము వీర్రాజు చేతుల్లోకి వచ్చిన పార్టీ పగ్గాలు ఇప్పుడు కొత్త ఆలోచనలకు నాంది పలికేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో తమ బలం, బలగం ఏంటన్న దానిపై స్పష్టత కలిగిన సోము వీర్రాజు నేతృత్వంలో అతి తక్కువ కాలంలో బలపడాలన్న బీజేపీ అధిష్టానం సంకేతాలు ఆ పార్టీ ఆలోచనా విధానంలో పెను మార్పులు తెచ్చేలా కనిపిస్తున్నాయి.

గేరు మారుస్తున్న సోము...
ఏపీ బీజేపీ పగ్గాలు అందుకోగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సోము వీర్రాజు ఇప్పుడు ఆ పార్టీలో మారిన పరిస్ధితులకు అచ్చమైన ప్రతిబింబంలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో టీడీపీ వెంట నడిచి ఆ తర్వాత టీడీపీ వదిలిపోయాక ఉన్న కాస్త పరువు పోగొట్టుకున్న బీజేపీ ఇప్పుడు సొంతంగా వ్యూహాలు రూపొందించుకునే పనిలో పడింది. తాను రూపొందించే వ్యూహానికి సహకరించాలని ఇప్పుడు బీజేపీ అధ్యక్ష హోదాలో సోము వీర్రాజు పవన్, చిరంజీవి, ముద్రగడ వంటి కాపు నేతలను కోరడం ద్వారా కొత్త సమీకరణాలకు తెరలేపారు.

పార్టీ నేతలను ఒప్పించే యత్నం..
ఇప్పటివరకూ పార్టీ నేతలు చెప్పినట్లు నాయకత్వాలు అడే పరిస్దితి నుంచి నాయకత్వం చెప్పినట్లుగా పార్టీ నేతలు నడుచుకోవాలనే సంకేతాలు పంపేందుకు ప్రయత్నిస్తున్న సోము వీర్రాజు ముందుగా పార్టీలో కీలక నేతలను స్వయంగా వెళ్లి కలుస్తున్నారు. పార్టీలో త్వరలో తాను చేపట్టేబోయే ప్రక్షాళనకు సహకరించాలని వారిని కోరుతున్నారు. రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలను సొంతం చేసుకున్న రెండు పార్టీల మధ్యే అధికారం చేతులు మారుతోందని, ఈసారి పరిస్దితిని మార్చి మరో సామాజికవర్గం సాయంతో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తాను వ్యూహం రచిస్తున్నట్లు సొంత పార్టీ నేతలకు సోము వివరిస్తున్నారు. దీనికి మీ మద్దతు కావాలని కోరుతున్నారు. వీరు సహకరిస్తారా లేదా అన్న సంగతి పక్కనబెడితే ముందుగా తన వంతుగా ఒప్పించేందుకు సోము ప్రయత్నిస్తున్నారు.

త్వరలో బీజేపీలోకి చిరు, ముద్రగడ ?
బీజేపీ గట్టెక్కాలంటే కాపు అజెండాను ముందుగా భజానికెత్తుకోవాలని భావిస్తున్న సోము.. ఆ మేరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, ముద్రగడను ఒప్పిస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షం రూపంలో పవన్ కళ్యాణ్ నుంచి సాయం తీసుకుంటున్న సోము వీర్రాజు, ఇక చిరంజీవి, ముద్రగడను నేరుగా పార్టీలోకి తీసుకోవడం ద్వారా కాపులను పూర్తి స్ధాయిలో ఆకర్షించి 2024 నాటికి అధికారానికి పోటీ పడేలా మార్చాలని భావిస్తున్నారు. ఇందుకు చిరంజీవి, ముద్రగడ నుంచి సానుకూల స్పందన వస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. అదే నిజమైతే త్వరలోనే వీరు బీజేపీ కండువాలు కప్పుకోవడం ఖాయం. ఇప్పటికైతే జగన్కు అనుకూలగా కనిపిస్తున్న చిరంజీవిని బీజేపీలోకి తెచ్చేందుకు, అవసరమైతే పగ్గాలు కూడా అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగినా ఆయన అంగీకరించలేదు. కానీ సోము నాయకత్వంలో కాపుల కోసం పోరాడితే ఫలితం ఉంటుందని భావిస్తే మాత్రం ఆయన కాషాయ కండువా కప్పుకున్నా ఆశ్చర్యం లేదు. ఇదే కోవలో టీడీపీకి వ్యతిరేకంగా జగన్కు అనుకూలంగా ఉన్నారని విమర్శలు ఎదుర్కొంటున్న మరో కీలక నేత ముద్రగడ కూడా బీజేపీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.