సమీక్షలకు వారిని పిలవండి, మావాళ్ళు తలుపులెయ్యాల్సి రావొచ్చు : స్పీకర్ తమ్మినేని సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన ఏకంగా అధికారులనే టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. మైనింగ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల తీరు ఏ మాత్రం బాగా లేదని అసహనం వ్యక్తం చేసిన ఆయన అధికారులు పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న పనుల కోసం ఇసుక తీసుకు వెళుతుంటే కూడా అడ్డుకున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కంటే డేంజరస్ వైరస్ .. చంద్రబాబు ఫైర్

స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులపై స్పీకర్ తమ్మినేని ఫైర్
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులపై మండిపడ్డారు. సెబ్ అని తుబ్ అని ఎన్నో వచ్చాయని ఎడ్లబండ్ల మీద ఇసుక తీసుకువెళ్ళే వారిపైన కూడా అధికారులు ప్రతాపం చూపిస్తున్నారని , కేసులు పెట్టడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పనులకు తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ల పై కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. సామాన్య పౌరుల పై కేసులు పెట్టడం పద్ధతేనా అంటూ ప్రశ్నించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

ఇసుక విషయంలో సామాన్యులపై కేసులు పెడతారా ?తమ్మినేని ఆగ్రహం
ప్రభుత్వ పనుల నిమిత్తం ఇసుక తీసుకు వెళుతున్నట్లుగా అనుమతి పత్రాలు చూపించినా వదిలిపెట్టడం లేదని మండిపడిన తమ్మినేని సీతారాం కొందరు అధికారులు తమ శాఖలకు అతీతుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల్ని వదిలిపెట్టి అన్ని పత్రాలు చూపిస్తున్న సామాన్యులను పట్టుకోవడం ఏంటి అంటూ ప్రశ్నించిన సీతారాం ఇకపై జరిగే సమీక్షలకు ఆ అధికారులందరినీ పిలవాలి అంటూ వ్యాఖ్యానించారు.

ముందు జరిగే సమీక్షలకు వారిని పిలవండి .. మావాళ్ళు తలుపులేసే పరిస్థితి రావచ్చు
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, మైనింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఇసుక విధానంపై బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిల్లా అధికారులను సమీక్షలకు ఆహ్వానించాలని చెప్పారు. వాళ్లంతా వస్తే మా వాళ్ళు తలుపులు వెయ్యాల్సిన పరిస్థితులు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
ఒక స్పీకర్ గా తాను అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, అయినా పరిస్థితులు అలా మారుతున్నాయి అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తమ్మినేని సీతారాం. అధికారుల ఓవరాక్షన్ కు ఎక్కడో ఒకచోట చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన, ఈ విషయాలన్నింటిని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా మంటూ పేర్కొన్నారు.

గతంలోనూ రెవెన్యూ అధికారులపై ఫైర్ .. ఇప్పుడు సెబ్ అభికారులపై
గతంలోనూ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారులపై ఫైర్ అయ్యారు. వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు . వారి మీద అందరి ముందు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. పొందూరులో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన అంశాన్ని అధికారులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళిన సందర్భంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని చెప్పడానికా మీరున్నది అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఇప్పుడు మరోమారు ఇసుక విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు .