ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం పెద్ద దుమారంగా మారింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై వైసీపీ మంత్రులు, నేతలు, ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న తరుణంలో ఎవరి రాజకీయ లబ్ది కోసం ఎన్నికలు
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఆయన ప్రెస్ మీట్ పొలిటికల్ సమావేశంలా సాగిందని విమర్శించారు. 2018లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు, 2021లో జరగడానికి కారకులు ఎవరని ప్రశ్నించిన ఆయన, రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న తరుణంలో ఎవరి ప్రాపకం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీ పంచాయితీ పోరు : గ్రామ వాలంటీర్లను టార్గెట్ చేస్తూ , తెర మీదకు కొత్త డిమాండ్లు

ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం పోతున్నారు.. ఎందుకంత నియంతృత్వ పోకడ
మీరు అద్దాల గదిలో ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఎన్నికల పోలింగ్ కోసం ఇతర ప్రాంతాల నుండి వలస కార్మికులు వస్తారని, గతంలోనూ వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాపించిన సందర్భాలు ఉన్నాయని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం పోతున్నారు , ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మీరు కుర్చీలో ఉండగానే ఎన్నికలు జరపాలా ? మరొకరు జరపకూడదా ? ఎందుకంత నియంతృత్వ పోకడ.. అంటూ తమ్మినేని నిప్పులు చెరిగారు.

ఉద్యోగులు తిరగబడితే మీ పరిస్థితి ఏంటి?
రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా ఉండి నిబంధనలు అతిక్రమిస్తున్నారని, సీఎస్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, న్యాయస్థానం తీర్పును మీరు ఉల్లంఘించలేదా అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం రమేష్ కుమార్ కు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎన్నికలు వద్దని ఉద్యోగులు తిరగబడితే మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఎన్జీవోలు ఎన్నికల విధులను బహిష్కరించారని, రేపో,మాపో ఎన్నికలను పోలీసులు కూడా బహిష్కరిస్తారు అంటూ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.

కొద్దిమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం మీరు తీసుకున్న నిర్ణయం
కొద్దిమంది వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ధన, మాన, ప్రాణాలకు భంగం వాటిల్లుతుందని, దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు . అవసరమైతే దీనిపై ప్రజల్లో రెఫరెండానికి వెళ్లాలని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఫోర్స్ మెజర్ కేసు కింద పరిగణించి ఎన్నికలను ఆపాల్సిన అవసరం ఉందని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.