Kesineni Nani: టీడీపీలో మరో రఘురామ..చంద్రబాబుకు తలనొప్పి: కూతురు కోసం పార్టీలో!
విజయవాడ: వరుస రాజీనామాలు, వలసలతో కుదేల్ అయిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. టీడీపీలో కొత్తగా తిరుగుబాటు రాజకీయాలు మొదలైనట్టున్నాయి. విజయవాడ కేంద్రంగా టీడీపీలో రెబల్ రాజకీయాలు పురుడు పోసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని..రెబెల్ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారొచ్చని అంటున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ఎంపీగా ముద్రపడిన రఘురామ కృష్ణంరాజు తరహాలోనే కేశినేని నాని వ్యవహార శైలి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.
తెలుగంటే మంత్రులు మాట్లాడే బూతు కాదు: ఇంగ్లీష్ మీడియంలో బోధనపై చంద్రబాబు క్లారిటీ

సొంత క్యాడర్‌పై
కారణాలేవైనప్పటికీ- కొంతకాలంగా కేశినేని నాని.. పార్టీ అగ్ర నాయకత్వం పనితీరును అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నాయకుల నుంచి తనకు ఏ మాత్రం సహకారం అందట్లేదని ఆయన బాహటంగా చెప్పుకొంటున్నారు. ఆరుమంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయిన చోట.. తాను మాత్రమే గెలిచానని, ఓటర్లు వ్యక్తిగతంగా తన పనితీరును ఆదరించి, గెలిపించారే తప్ప సైకిల్ గుర్తును చూసి కాదంటూ కేశినేని చేసిన కామెంట్లు కలకలం రేపాయి.

కుమార్తె కోసం
తన కుమార్తె శ్వేత భవిష్యత్ కోసం రాజకీయాలు సాగిస్తున్నారనే ఆరోపణలను కేశినేని నాని ఎదుర్కొంటోన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని
విజయవాడ లోక్‌సభ పరిధిలోని టీడీపీ నాయకులు కేశినేని నానికి సహకరించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపట్లేదని చెబుతున్నారు. పైగా ఆయన వ్యవహార శైలి ఏకపక్షంగా ఉంటోందని బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. శాసన మండలి సభ్యుడు, సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఇదివరకు కేశినేనిపై చేసిన వ్యాఖ్యలను దీనికి నిదర్శనంగా చూపిస్తోన్నారు. కుటుంబ రాజకీయాలకు విజయవాడ కేంద్ర బిందువు కాకూడదనే ఉద్దేశంతో టీడీపీ నేతలు ఉన్నారని అంటున్నారు.

ట్విట్టర్ అకౌంట్ నుంచి
ఈ పరిణామాల మధ్య కేశినేని నాని.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి తెలుగుదేశం పార్టీ పేరును తొలగించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా తెలుగుదేశం పార్టీ కింది స్థాయి నాయకుల వరకు కూడా.. వారికి చెందిన ట్విట్టర్ అకౌంట్లో పార్టీ పేరు ఉంటుంది. #TDPTwitter అనే హ్యాష్‌టాగ్ పదాన్ని తప్పనిసరిగా వాడుతుంటారు. ఇదివరకు ఈ పదం కేశినేని నాని ట్విటర్ అకౌంట్లోనూ కనిపించేదని, ఇఫ్పుడది మాయమైందని అంటున్నారు. ఒకరకంగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికే ఈ పదాన్ని తొలగించారనే అంచనాలు ఉన్నాయి.

పార్టీలో కొనసాగుతూ..
ఇప్పట్లో కేశినేని నాని.. తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు లేదనే చెబుతున్నారు. పార్టీలో ఉంటూనే తిరుగుబాటు రాజకీయాలకు సెంటర్ పాయింట్‌గా మారుతారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తలమునకలుగా ఉన్నారు. టీడీపీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. పార్టీని వీడాలనుకుంటే ఇంతగా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఆయనకు ఉండకపోవచ్చని అంటున్నారు. పార్టీని వీడాలని కేశినేని అనుకోవట్లేదని, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజులాగా సొంత పార్టీకి తలనొప్పులను సృష్టిస్తూ వ్యవహరిస్తారనే ప్రచారం సాగుతోంది.