టీడీపీ సీనియర్లలో కమిటీల కుంపటి ... చంద్రబాబు బుజ్జగింపుల పర్వం సక్సెస్ అవుతుందా ?
అధికార వైసీపీతో నిత్య సమరం చేస్తున్న చంద్రబాబు నాయుడుకి సొంత పార్టీ నేతల అసంతృప్తి తలనొప్పిగా తయారైంది. సంస్థాగత ప్రక్షాళనకు నడుం బిగించిన టిడిపి కొత్త కమిటీలను ఏర్పాటు చేసి పార్టీలో పునః వైభవాన్ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు అధినేత చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది . చాలామంది సీనియర్లు కొత్త కమిటీలలో తమకు స్థానం దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన నాటినుండి గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన నాయకులు చాలామంది సైలెంట్ అయ్యారు. కొందరు జంప్ అయ్యారు. కొందరు పార్టీలో గుర్తింపు కోసం తెగ తాపత్రయపడుతున్నారు . ఇటీవల కమిటీలలో స్థానం దక్కుతుందని అసహించిన పలువురు భంగపడ్డారు
విధ్వంసాలతో ఏపీ 'బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా'గా .. గీతం కూల్చివేతలపై చంద్రబాబు ఫైర్

సామాజిక వర్గాల సమతూకం కోసం కమిటీలలో సీనియర్లకు దక్కని స్థానం
మంత్రులుగా పదవులు అనుభవించిన వారు కూడా పార్టీ గొంతును గట్టిగా వినిపించలేకపోతున్నారు. ఈ సమయంలో పార్టీ గొంతు గట్టిగా వినిపించే వారికి, అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం సాగించే వారికి తెలుగుదేశం పార్టీ కమిటీలలో కీలక స్థానం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు, సామాజిక వర్గాల సమతూకం పాటించాల్సిన నేపథ్యంలో అది సాధ్యం కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
ఇటీవల కొత్త కమిటీలు ఏర్పాటు చేయడంతో పదవులు ఆశించి కొందరు సీనియర్ నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారని సమాచారం.

కీలక నాయకుల్లో అసంతృప్తి
గుంటూరు జిల్లాలో కీలకంగా పనిచేస్తున్న ఆలపాటి రాజా అధికార పార్టీపై పోరాటం చేస్తున్నారు , కృష్ణాజిల్లాలో కీలకంగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు సైతం ప్రభుత్వ తీరును నిత్యం ప్రశ్నిస్తున్నారు. ఇక ఇలాంటి కీలక నాయకులకు సైతం కొత్త కమిటీలో స్థానం దక్కలేదు. అంతేకాదు విజయవాడ ఎంపీ కేశినేని నాని, పార్టీ గళాన్ని నిత్యం వినిపిస్తున్న పంచుమర్తి అనురాధ, మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఇలా చాలామంది సీనియర్ నాయకులు పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తుంది.

అసంతృప్తులను బుజ్జగించే పనిలో చంద్రబాబు
దీంతో చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి అసంతృప్తులను బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే చాలామంది తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్న సమయంలో తాజాగా టిడిపి కొత్త కమిటీలు పార్టీలో కుంపటి పెట్టాయి. సీనియర్ల అసంతృప్తికి కారణమవుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ముఖ్య నాయకులతో చెప్తున్నారు. స్వయంగా ఆయనే ఫోన్లు చేసి బజ్జగించే పనిలో పడ్డారు .

టీడీపీలో ఉంటారా ? వైసీపీకి జై అంటారా
భవిష్యత్తులో కొంతమంది నేతలకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించాలని, పార్లమెంట్ కమిటీ లలో కూడా కొందరిని సర్దుబాటు చేయాలని చూస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీతో పోరాటం చేయడం టిడిపి నాయకులకు కత్తి మీద సాములా మారింది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వారిని టార్గెట్ చేసి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్న భావన టిడిపి నేతల్లో బలంగా ఉంది. ఈ సమయంలో పార్టీలో కూడా ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తికి గురవుతున్న టిడిపి నేతలు పార్టీలో కొనసాగుతారా లేక వైసిపి బాట పడతారా అనేది ఆలోచించాల్సిన అంశం.