రామతీర్ధంలో మళ్ళీ ఉద్రిక్తత .. బీజేపీ నేతలకు పోలీసులకు తోపులాట.. సొమ్మసిల్లి పడిపోయిన సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామతీర్థం రగడ చల్లారేలా కనిపించడం లేదు. మొన్నటికి మొన్న బిజెపి, జనసేన నేతల రామతీర్థం పర్యటనను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రామతీర్థం వెళ్లాలని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకొని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. బీజేపీ విజ్ఞప్తి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి రామతీర్థ సందర్శనకు అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ ఈ రోజు బీజేపీ నేతల రామతీర్ధం ధర్మ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది .
ఫేక్ సీఎం జగన్.. రామతీర్ధం ఘటన జరిగి ఐదు రోజులైనా ఏం గడ్డి పీకారు : చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

కొండపైకి బీజేపీ నేతలందరినీ అనుమతించని పోలీసులు .. బీజేపీ నేతలకు పోలీసులకు వాగ్వాదం
ధర్మ యాత్రలో భాగంగా బిజెపి నేతలు భారీ సంఖ్యలో రామతీర్థం వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. రామతీర్థం కొండ పైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్న క్రమంలో నెల్లిమర్ల జంక్షన్ వద్ద బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు .దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రామతీర్థం కొండ పైకి ఐదుగురు మాత్రమే అనుమతిస్తామని, ఐదుగురు వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా పోలీసులు చెప్తుండగా, కొండపైకి వెళ్లేందుకు బీజేపీ నేతలందరినీ అనుమతించాలని బీజేపీ నేతలు కార్యకర్తలు డిమాండ్ చేశారు.

బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట , సొమ్మసిల్లిన సోము వీర్రాజు , విష్ణువర్ధన్ రెడ్డి
బారికేడ్లని అడ్డు పెట్టి బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులను తోసుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు బిజెపి నేతలందరూ కొండపైకి వెళ్లే ప్రయత్నం చేసిన క్రమంలో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తోపులాటలో ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఇక రామ తీర్థానికి ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్సీ మాధవ్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
రామతీర్ధంలో భారీగా పోలీసు బలగాలు , సెక్షన్ 30 అమల్లో
ప్రస్తుత రామతీర్థం పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు . ఇక రామతీర్థంలో ఈ నెలాఖరు వరకు సెక్షన్ 30 అమల్లో ఉంటుందని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. రామతీర్థం కూడలి నుండి దేవస్థానం వరకు, బోడి కొండపైన కోదండరామ ఆలయం వద్ద భారీగా పోలీసులు బలగాలు పహారా కాస్తున్నారు. నాలుగు వేల మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఎటువంటి మతపరమైన విద్వేషాలు చోటుచేసుకోకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు.