విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్: ఒమిక్రాన్ నిర్ధారణ పరీక్షలు ఇక్కడే
విజయవాడ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభణ మొదలు పెట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతోన్నాయి. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 33 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. అదే సమయంలో- ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతమౌతోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 1,700. ఈ సంఖ్యకు అడ్డు, అదుపు ఉండట్లేదు. రోజురోజుకూ ఇవి పెరుగుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య పలు రాష్ట్రాలు ఆంక్షలను విధించుకున్నాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, హర్యానా వంటి రాష్ట్రాలు పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేశాయి. ఇదివరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రారంభ రోజుల్లో నిర్దారణ పరీక్షలను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. టెస్టింగ్ రిపోర్టులు రావడానికి చాలా సమయం పట్టేది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం- టెస్టింగ్ సెంటర్లను విస్తృతం చేసింది. దీనికి అవసరమైన సదుపాయాలను కల్పించింది.

ఇప్పుడు అదే తరహాలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీల ఏర్పాటు అవసరమైంది. రిస్క్ కంట్రీస్ నుంచి స్వదేశానికి వచ్చిన తరువాత లేదా ట్రావెల్ హిస్టరీ ఉండి కరోనా వైరస్ బారిన పడితే- వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించాల్సి వస్తోంది. ఈ జీనోమ్ సీక్వెన్సులు ప్రస్తుతం పరిమితంగా ఉంటోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే- హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులొస్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఒక్కటే అందుబాటులో ఉంది. దీన్ని సేవలు మరింత విస్తృతం అయ్యాయి.
విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటైంది. సిద్ధార్థ వైద్య కళాశాలలో దీన్ని నెలకొల్పారు. సీీసీఎంబీ పర్యవేక్షణలో సాగుతుందీ ల్యాబ్. ఏపీకి సంబంధించినంత వరకు ఒమిక్రాన్ అనుమానితుల నమూనాలను ఇకపై హైదరాబాద్ సీసీఎంబీకి పంపించాల్సిన అవసరం ఉండదు. ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. దీనివల్ల ఆయా శాంపిళ్ల రిపోర్టులు త్వరితగతిన అందుతుందని అధికారులు చెబుతున్నారు.
కాగా- ఏపీలో ప్రస్తుతం ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పరిమితంగా ఉంటోన్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువే. సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఏపీలో 17 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంఖ్య పెరగదనే గ్యారంటీ ఉండట్లేదు. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఏపీ 12వ స్థానంలో ఉంటోంది. తెలంగాణలో 67 కేసులు రికార్డయ్యాయి. 27 మంది డిశ్చార్జ్ అయ్యారు.