andhra pradesh vishnuvardhan reddy ap bjp tdp chandrababu ntr viceroy hotel టీడీపీ చంద్రబాబు ఎన్టీఆర్ politics
అప్పుడు ఎన్టీఆర్‌పై, ఇప్పుడు నాపై- లైవ్‌లో చెప్పులదాడి ఘటనపై బీజేపీ నేత విష్ణు ట్వీట్లు
ఏబీఎన్ టీవీ ఛానల్ లైవ్ చర్చలో బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిపై జరిగిన దాడి ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ మాటల దాడులకే పరిమితమైన నేతలు ఏకంగా లైవ్‌లోనే జనం చూస్తున్నారని కూడా లేకుండా ప్రత్యర్ధులపై దాడులకు దిగడంపై సాధారణ జనం విస్తుపోతున్నారు. ఇప్పుడు ఇదే ఘటనపై స్పందించిన బాధితుడు, బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి దీనికి టీడీపీ అధనేత చంద్రబాబే కారణమంటూ విమర్శలకు దిగారు.
ఏబీఎన్ ఛానల్ లైవ్ డిబేట్లో తనపై అమరావతి ఉద్యమంలో జేఏసీ నేతగా ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాసరావు చెప్పుతో చేసిన దాడిపై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి తాజాగా మరోసారి స్పందించారు. ఈసారి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబునే టార్గెట్ చేశారు. అంతే కాదు చంద్రబాబుకు గతాన్ని గుర్తు చేస్తూ మరీ విష్ణు చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ట్వీట్లో టీడీపీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీయర్ను కూడా విష్ణు ప్రస్తావించారు. ఎన్టీఆర్ విషయంలో టీడీపీ నేతలను కూడా టార్గెట్ చేశారు.

గతంలో హైదరాబాద్‌లోని వైశ్రాయ్ హోటల్‌కు టీడీపీ ఎమ్మెల్యేలను పిలిపించుకున్న చంద్రబాబు వారిని టీడీపీ అధినేతగా ఉన్న ఎన్టీఆర్‌కు దూరం చేశారు. దీనిపై అడిగేందుకు అక్కడికి వచ్చిన ఎన్టీఆర్‌పై ఏకంగా చెప్పులు వేయించారు. ఈ ఘటనను ఇప్పుడు విష్ణు ప్రస్తావిస్తూ తనపై దాడిని దీంతో పోల్చారు. అప్పుడు ఎన్టీఆర్‌పై చెప్పులేయించారు. ఇప్పుడు నాపై దాడి చేయించారు. అప్పుడు ఎన్టీఆర్‌పై వైశ్రాయ్ హోటల్ వద్ద జరిగిన దుశ్చర్యాకాండ నిన్నటి ఏబీఎన్ చర్చ కార్యక్రమం వరకూ కొనసాగుతూనే ఉందంటూ విష్ణు ట్వీట్లో విమర్శించారు. భౌతిక దాడులతో నాయకుల ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తామనుకోవడం మీ మూర్ఖపు ఆలోచన..జై టీడీపీ అంటూ ముగించారు.

మరో ట్వీట్లో ప్రజల తరఫున ప్రశ్నించడంలో తాను వెనుకడుగు వేసేది లేదంటూ దాడులకు బెదిరిపోమంటూ విష్ణు చెప్పుకొచ్చారు.
అణగారిన వర్గాలను అడ్డుపెట్టుకుని మీ నీచపు రాజకీయ సంస్కృతితో మా గొంతు నొక్కడం అసాధ్యమన్నారు. నా మీద, మా పార్టీ మీద మీ అనుకూల సామాజిక మాధ్యమాల ద్వారా చేసే తప్పుడు ప్రచారం ఇకనైనా మానుకుంటే మంచిదని విష్ణు పేర్కొన్నారు. చెప్పుదాడి ఘటనలో తనకు అండగా నిలబడిన వారికి విష్ణు ధన్యవాదాలు తెలిపారు.