వంగవీటి రాధా పవన్ ను కలవటం వెనుక అంతర్యం అదేనా ? జనసేనలో ఈ సారైనా చేరిక పక్కానా ?
ఏపీ ఎన్నికల్లో పరాజయం పాలైన టీడీపీ నుండి నేతలు వలసబాట పట్టారు. ఎవరు ఏ పార్టీలోకి జంప్ అంటున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇక విజయవాడ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే వంగవీటి రాధాకు జంప్ అవ్వటానికి రెడీ అయినట్టు తెలుస్తుంది . ఇప్పటికే రెండుసార్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన వంగవీటి రాధా తాజాగా మరోమారు పవన్ తో భేటీ అయ్యారు. టీడీపీ నాయకుడు వంగవీటి రాధా ఎన్నికల ముందు వైసీపీ నుండి బయటకు వచ్చే సమయంలో ముందు జనసేనలోనే చేరతారని అందరూ భావించారు . కానీ రాధా చేరలేదు . అనూహ్యంగా టీడీపీలో చేరారు. ఇక తాజాగా టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో ఆయన పవన్ పార్టీ లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

రాధాతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ... ఇప్పటికే పలు మార్లు కలిసిన రాధా
వంగవీటి రాధా.. వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ఎన్నికలకు ముందు విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో వైసీపీ అధినేత తీరుతో పార్టీ మారి టీడీపీలో చేరారు. ఇక ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రావటంతో వంగవీటి పరిస్థితి మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది. ఇక వంగవీటి తాజాగా పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే రాధా త్వరలో జనసేనలో చేరబోతున్నారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఇప్పటికే రెండు సార్లు జనసేనాని పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. అందుకే పవన్ తో భేటీ అయిన ఆయన దాదాపు గంటకు పైగా మాట్లాడారు .అయితే అప్పుడు పార్టీలో చేరతారు అనుకుంటే చేరలేదు .ఇప్పుడు మరోమారు పవన్ ను కలిశారు.

దిండిలో జనసేనానిని కలిసిన వంగవీటి రాధా
ఇక తాజా పరిణామాలతో వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా దిండిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వంగవీటి రాధా కలవడం రాజకీయవర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది . దిండిలోని రిసార్ట్స్‌లో జరుగుతున్న జనసేన సమావేశాలకు హాజరైన వంగవీటి రాధా పవన్ కళ్యాణ్‌ను కలిశారు. దీనికంటే ముందు నాదెండ్ల మనోహర్ తో రాధా భేటీ అయ్యాడు.

మీనా మేషాలు లెక్క పెడుతున్న రాధా ! జనసేన లో చేరేది ఎన్నడో ?
ఎన్నికల్లో పరాభవం నుంచి కోలుకున్న జనసేన అధినేత ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. జనసేనలో కూడా ప్రస్తుతం ఆ జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వంగవీటి వారసుడు ఆ పార్టీ పట్ల ఆకర్షితుడవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో నిర్వహించిన టీడీపీ జనరల్ బాడీ సమావేశానికి రాధా రాకపోవడంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటికి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది . పవన్ తో భేటీతో ఈ ప్రచారం నిజమే అని అర్థమవుతోంది. కానీ ఇప్పటికే పలు దఫాలుగా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన రాధా ఎప్పటి వరకు జనసేన బాట పడతారు అనేది మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా వైసీపీ కి రాజీనామా చేసిన రాధా టీడీపీలో చేరటానికి చాలా సమయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు కూడా అదే ధోరణిలో రాధా ఉన్నట్టు కనిపిస్తుంది.