అయోధ్య రామాలయానికి ముస్లింల విరాళాలు- బెజవాడ తాహెరా ట్రస్టు రూ.10 లక్షలు
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయం కోసం దేశంలో పలువురు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. సెలబ్రిటీలతో పపాటు సాధారణ ప్రజలు కూడా తమకు తోచిన స్ధాయిలో విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇదే కోవలో పలువురు ముస్లింలు కూడా రామాలయ నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పుడు ఏపీలోని విజయవాడలోనూ ఓ మైనార్టీ ట్రస్టు అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్నాలని పిలుపునిచ్చింది.
అయోధ్య రామాలయం నిర్మాణం కోసం తమ వంతుగా రూ.10 లక్షలు విరాళం ఇవ్వాలని విజయవాడకు చెందిన తాహెరా ట్రస్టు నిర్ణయించింది. త్వరలో ఈ మేరకు చెక్కును అయోధ్య ట్రస్టుకు పంపుతామని ట్రస్టు నిర్వాహకురాలు జాహెరా బేగం ప్రకటించారు.
రామాలయం నిర్మాణంలో ముస్లింలు కూడా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయాన్ని దేశంలో ప్రతీ ఒక్కరూ సమర్ధిస్తున్నారని ఆమె అన్నారు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరికో రామాలయ నిర్మాణం గర్వకారణమని జాహెరా బేగం తెలిపారు. ఇప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సమాజంలోని పెద్దలు ముందుకొచ్చి అయోధ్య రామాలయం కోసం నిధులు సమకూర్చే బాధ్యత తీసుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సోదరభావన కలుగుతుందన్నారు. మతకలహాల నివారణ కోసం రాముడు చూపిన బాటలో సాగుదామని జాహెరా పిలుపునిచ్చారు.

పదేళ్లుగా తాము కూడా విజయవాడలో తాహెరా ట్రస్టు ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు జాహెరా తెలిపారు. గ్రామాల్లో వినాయక చవితి, శ్రీరామనవమి, దసరా పండుగలు వచ్చినప్పుడు ముస్లింలు చందాలు ఇచ్చి పండుగలో తామూ భాగస్వాములు అవుతారని ఆమె గుర్తు చేశారు. అలాగే ముస్లింలకు సంబంధించిన మసీదులు, దర్గాలు, ఖబర్స్తాన్లకు హిందువులు విరాళాలు ఇస్తున్నారన్నారు. కాబట్టి ఇప్పుడు అయోధ్య రామాలయం కోసం కూడా ముస్లింలు విశాల హృదయంతో ముంచుకొచ్చి విరాళాలు అందించడంలో తప్పులేదన్నారు. భిన్నమతాల, సంసృతుల వేదిక అయిన భారత్లో అంతా కలిసి మెలిసి ఉండటం ఎప్పటి నుంచో ఉందన్నారు. మధ్యలో వచ్చిన కుల, మతాలను అక్కడే వదిలేయాలన్నారు.