గన్నవరం వైసీపీలో మళ్ళీ లొల్లి ... వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా దుట్టా వర్గం ఆందోళన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీలో వర్గ పోరు రోజురోజుకు పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వైసీపీలో గ్రూపు తగాదాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో వల్లభనేని వంశీ ఎంట్రీ నుండి వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. టిడిపి నుండి గెలిచి వైసిపికి మద్దతు ఇస్తున్న వల్లభనేని వంశీ వర్గానికి, వైసిపి నేత దుట్టా రామచంద్రరావు వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.
వంశీ వైసీపీకి మద్దతు ప్రకటించిన నాటి నుండి ఇప్పటివరకు నిత్యం ఏదో ఒక ఘర్షణ వారి మధ్య తలెత్తుతూనే ఉంది.
లోకల్ వార్..గన్నవరంలో యార్లగడ్డకు చెక్..వైసీపీ అభ్యర్థుల ఎంపికలో వల్లభనేని వంశీ

వల్లభనేని వంశీ వర్సెస్ దుట్టా వర్గం
ఇప్పటికే పలుమార్లు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీ లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు అధిష్టానానికి జోక్యం చేసుకొని కలిసి పని చేయాలని చెప్పినప్పటికీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసిపి కార్యకర్తలను వంశీ ఇబ్బంది పెట్టాడు అని, టిడిపిలో ఉన్న సమయంలో శత్రువుగా భావించిన వంశీని, వైసిపికి మద్దతిచ్చినంత మాత్రాన మిత్రునిగా చూడలేమని వైసీపీనేతలు పరోక్షంగా చెబుతూనే ఉన్నారు.

కాకులపాడులో ఎంపీడీవో కార్యాలయం వద్ద దుట్టా వర్గం ఆందోళన
గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కాకులపాడులో ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాకులపాడు వైసీపీ నేత సూరపనేని రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన దుట్టా వర్గం వంశీ అరాచకాలను ఇప్పటికైనా ఆపాలంటూ నినాదాలు చేశారు.
గతంలో 2 నెలల క్రితం సచివాలయం, రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సమయంలో తలెత్తిన ఘర్షణ తాజాగా మరోమారు దుట్టా వర్గం ఆందోళనతో చర్చనీయాంశమైంది.

వంశీ అనుచరులకు అన్ని కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని ఆందోళన
కాకులపాడు లో రెండు నెలల క్రితం రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్ర రావుల ముందే వైసిపి కార్యకర్తలు రెండు వర్గాలుగా ఏర్పడి బాహాబాహీకి దిగారు. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునే దాకా వెళ్లి పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు.
ఇక తాజాగా ఆ గొడవ మళ్ళీ పునరావృతమైంది.
టిడిపి నుండి వచ్చిన వంశీ అనుచరులకు అన్ని కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని మండిపడిన దుట్టా వర్గం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలియజేసింది.

అంబేద్కర్ విగ్రహానికి, ఎంపీడీవోకు వినతి పత్రం
టిడిపి నుండి వచ్చిన వంశీ అనుచరులకు నిర్మాణ బాధ్యతలు అప్పగించడంపై ఆందోళన చేపట్టిన దుట్టా వర్గం బీసీ, ఎస్సీలపై వంశీ అరాచకాలను ఆపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కలుగజేసుకొని పార్టీ కార్యకర్తలను కాపాడాలని నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి, ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. గన్నవరం నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు వైసిపిలో అంతర్గత కలహాలకు అద్దం పడుతున్నాయి. అధిష్టానం జోక్యం చేసుకున్నా, మంత్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా గన్నవరం నియోజకవర్గంలో మారని నేతల తీరు బహిరంగ ఆందోళనలతో పార్టీ పరువును రోడ్డున పెడుతోంది.