ఆన్లైన్ ద్వారా నామినేషన్లు: జగన్ పుణ్యంతో జైలుకు: సుమోటో: అన్ని స్థానాల్లో పోటీ: సోము-నాదెండ్ల
విజయవాడ: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన రీషెడ్యూల్ ప్రకారం.. తొలిదశ పోలింగ్ కోసం శుక్రవారం నుంచి నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు దీనిపై దృష్టి సారించాయి. గ్రామ స్థాయిలో పార్టీ శ్రేణులను సమాయాత్తం చేస్తోన్నాయి. ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకునే పంచాయతీలకు జగన్ సర్కార్ భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. దాని ప్రభావం ఎంతమేర ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
AP Panchayat Elections: ఏకగ్రీవాల కోసం జగన్ సర్కార్ కొత్త ఎత్తుగడ: రూ.లక్షల్లో నజరానా

పంచాయతీ స్థానాల సీట్ల సర్దుబాటుపై..
ఈ పరిణామాల మధ్య.. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉంటోన్న భారతీయ జనతాపార్టీ-జనసేన సమావేశం అయ్యాయి. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలకు చెందిన రెండు పార్టీల నాయకులు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు. సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చించాల్సి ఉందని అన్నారు.

నియంతగా ముఖ్యమంత్రి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రమంగా నియంతలా వ్యవహరిస్తున్నారని సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఉమ్మడిగా పోటీ చేయబోతోన్నామని అన్నారు. అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. గ్రామ స్థాయిలో యువతకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. యువత రాజకీయాల్లోకి ప్రవేశించడానికి వీలుగా తాము వారిని ప్రోత్సహిస్తామని, పోటీ చేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.

ఏకగ్రీవాల కోసం కొత్త కుట్రం..
రాష్ట్రంలో పంచాయతీలను ఏకగ్రీవంగా దక్కించుకోవడానికి జగన్ సర్కార్ కొత్త కుట్రకు తెర తీసిందని సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఎన్నికలనేవి ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మల్లాంటివని, అలాంటి ఎన్నికలనే లేకుండా చేయడానికి ప్రభుత్వం ఏకగ్రీవం పేరుతో కుట్ర పన్నుతోందని విమర్శించారు. ఏకగ్రీవాలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఈ నెల 29వ తేదీన తెలుస్తుందని వారు అన్నారు. ఏకగ్రీవాల పేరుతో ప్రభుత్వం నామినేషన్లు వేసే అవకాశాన్ని కల్పించకపోతే తాము గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. 29న గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నామని తెలిపారు.

సుమోటోగా తీసుకోవాలి..
నామినేషన్ల పక్రియ సజావుగా సాగాలని తాము కోరుకుంటున్నామని నాదెండ్ల అన్నారు. ఏకగ్రీవాలకు వెళ్లకుండా ఎన్నికలను నిర్వహించి.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పోటీ నుంచి విరమించుకోవడానికి స్థానిక రాజకీయ నాయకులు, యువతను భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం దీన్ని సుమోటోగా తీసుకోవాలని సూచించారు.

ఆన్లైన్ ద్వారా నామినేషన్లు..
నామినేషన్లను దాఖలు చేసే వాతావరణాన్ని కల్పించలేని గ్రామాల్లో ఆన్లైన్ ద్వారా వాటిని దాఖలు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు నామినేషన్ పత్రాలను చించేసిన సందర్భాలు ఇదివరకు చోటు చేసుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ ద్వారా నామినేషన్లను దాఖలు చేసే ప్రక్రియను చేపట్టేలా గవర్నర్‌ను కోరుతామని అన్నారు. జగన్ పుణ్యమా అంటూ పలువురు ఐఎఎస్ అధికారులు జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, మళ్లీ అలాంటి వాతావరణాన్నే ఆయన సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.