టీడీపీలో దేవినేని ఒంటరయ్యారా ? కొడాలితో పోరులో కలిసిరాని నేతలు- మద్దతు కోసం యత్నాలు
నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో కృష్ణాజిల్లా దేవినేని కుటుంబ హవా అంతా ఇంతా కాదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా దేవినేని కుటుంబానికి ఎదురేలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దేవినేని ఉమ కృష్ణాజిల్లాకు సీఎంగా ఉండేవారన్న ప్రచారం సాగేది. జిల్లా రాజకీయాలపై ఉమకు ఉన్న పట్టు అలాంటిది. కానీ గత టీడీపీ ప్రభుత్వంలో ఉమ వ్యవహారశైలి కారణంగా ఆయన చుట్టూ ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా కనుమరుగయ్యారు. విజయవాడలో సైతం ఆయనకు మద్దతు కరువైన పరిస్ధితి. అధికారంతో సంబంధం లేకుండా జిల్లాలో ఒకప్పుడు ఏకపక్షంగా పార్టీ రాజకీయాలు నడిపిన దేవినేని ఉమ ఇప్పుడు సొంత సామాజిక వర్గానికి చెందిన మంత్రి కొడాలినానితో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో మాత్రం ఒంటరైనట్లే కనిపిస్తోంది.

కృష్ణాజిల్లాలో దేవినేని హవా
కృష్ణాజిల్లాలో టీడీపీకి దశాబ్దాలుగా వెన్నెముకగా ఉన్న కుటుంబాల్లో దేవినేని కుటుంబం కూడా ఒకటి. ఒకప్పుడు దేవినేని నెహ్రూ, దేవినేని వెంకటరమణ, ఆ తర్వాత దేవినేని ఉమ ఇలా ఆ కుటుంబం హవా కొనసాగింది. నెహ్రూ పార్టీలు మారినా వెంకటరమణ, ఉమ సోదరులు మాత్రం టీడీపీలోనే ఉండిపోయారు. మంత్రిగా ఉన్న వెంకట రమణ ఆకస్మిక మరణం తర్వాత టీడీపీలో చక్రం తిప్పడం మొదలుపెట్టిన దేవినేని ఉమ స్ధానబలమున్న కృష్ణాజిల్లాలో నేతలందరినీ తన విస్తృత పర్యటనలతో ఏకతాటిపైకి తెచ్చేశారు. దాని ఫలితమే 2014 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ విజయాలు.

మంత్రిగా దేవినేని ఏకపక్ష నిర్ణయాలు
2014 ఎన్నికల్లో విజయం తర్వాత చంద్రబాబు కేబినెట్లో తొలిసారి చోటు దక్కించుకున్న దేవినేని ఉమ అనంతరం తన హవా మరింత పెరుగుతుందని ఆశించారు. కృష్ణాజిల్లాలో ఎప్పటినుంచో తనకు మద్దతుగా ఉన్న రాజకీయ కుటుంబాలతో పాటు మీడియానూ దూరం చేసుకున్నారు. మంత్రిగా ఉంటూ జిల్లాలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలతో ఆయనకు ఎప్పటినుంచో మద్దతుదారులుగా ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా దూరమవడం ప్రారంభించారు. చివరికి ఆయన సొంత నియోజకవర్గం మైలవరంలోనూ నేతలు వైసీపీకి జంప్ అయిపోయిన పరిస్ధితి. ఫలితంగా ఐదేళ్ల పాటు మంత్రిగా, పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దేవినేని ఉమ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు.

కొడాలితో పోరుకు దేవినేని ప్రయత్నాలు
సొంత సామాజిక వర్గం నేత, ఒకప్పటి పార్టీ సహచరుడు, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొడాలి నానితో రాజకీయ పోరాటానికి దేవినేని సిద్ధమయ్యారు. వరుసగా నానిని టార్గెట్ చేస్తూ పార్టీతో పాటు జిల్లాలోనూ కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందాలని దేవినేని ఉమ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే నానితో పోరాటంలో ఆయనకు కలిసి వచ్చేవారే లేకుండా పోయారు. మంత్రిగా ఉండగా అతిగా ప్రాధాన్యమిచ్చిన కొందరు నేతలు మినహా మిగతా అంతా ఆయనకు దూరమయ్యారు. కొడాలితో సై అంటే సై అంటూ అరెస్టుల వరకూ వెళ్లిన దేవినేనికి పార్టీ నేతల మద్దతు లభించడం లేదని సులువుగానే అర్దమైంది.

మద్దతివ్వాలంటూ నేతలకు దేవినేని ఫోన్లు
కొడాలి నానితో ముఖాముఖీ పోరుతో జిల్లాలో కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందాలని భావిస్తున్న దేవినేని ఉమకు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు కరవవడం తీవ్రంగా బాధిస్తోంది. దీంతో ఆయన గతంలో తనకు మద్దతుదారులుగా ఉండి గత ప్రభుత్వంలో దూరమైన పలువురికి ఫోన్లు చేసి మద్దతు కోసం అభ్యర్ధిస్తున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు మర్చిపోయి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. తనతో ఏదైనా తప్పు జరిగితే పెద్ద మనసు చేసుకుని క్షమించాలని వేడుకుంటున్నారు. ఒకప్పుడు ఒంటెద్దు పోకడలతో తమను దూరం చేసుకున్న ఉమ.. ఇప్పుడు స్వయంగా ఫోన్ చేసి మద్దతు కోరుతుంటే వారు కూడా కాదనలేని పరిస్ధితి. అయినా ఇంకా పార్టీలో పలువురు సీనియర్ నేతలు ఆయనతో కలిసి నడిచేందుకు సిద్ధం కావడం లేదు.