అమరావతి నిర్మాణానికి బ్రేకులు వేసిన ప్రపంచ బ్యాంకు .. జగన్ ముందుంది పెను సవాల్
ఏపీ రాజధాని అమరావతి పై నీలి నీడలు కమ్ముకున్నాయా ? రాజధాని అమరావతి నిర్మాణానికి బ్రేకులు పడనున్నాయా ? అంటే అవును అనే తాజా పరిణామాలను బట్టి అనిపిస్తుంది. అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటే తనిఖీలు నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. అయితే ప్రపంచబ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం ఇప్పటి వరకు దేశంలో లేదని, ఇప్పుడు అవకాశం ఇవ్వకూడదని కేంద్రం చెప్తోంది. ఇక దీంతో జగన్ కు రాజధాని వ్యవహారం పెను సవాల్ గా మారింది.
మరోసారి ప్రత్యేక హోదా నో అని తేల్చి పారేసిన కేంద్రం .... జగన్ సైలెన్స్ కి అర్ధం ఏంటి ?

రాజధాని నిర్మాణానికి సంబంధించి బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ తనిఖీ నిర్ణయం
మరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటే తనిఖీలు నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంక్ తమ అభిప్రాయాన్ని ఈ నెల 23వ తేదీలోపుగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే కేంద్ర మాత్రం ఈ తనిఖీలను వ్యతిరేకిస్తుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయాలని స్పష్టం చేసిన నేపధ్యంలో ఈ మేరకు కేంద్రం నుండి రాష్ట్రానికి వరల్డ్ బ్యాంకు నుండి సమాచారం అందింది. అయితే ఈ విషయమై తమకు మరింత గడువు కావాలని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. కానీ కేంద్రం ఈ వ్యవహారంలో తమ నిర్ణయాన్ని రాష్ట్రానికి చెప్పేసింది .

ఇన్స్పెక్షన్ ప్యానెల్ తనిఖీలకు నో అంటున్న కేంద్రం .. నిధుల సమీకరణ వేరే మార్గాలతో చేసుకోవాలని సూచన
ప్రపంచబ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం అనేది కొత్త సంప్రదాయమని భావిస్తున్న కేంద్రం అవకాశం ఇస్తే దేశంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు కూడా తనిఖీలు చెయ్యాలని చూస్తారని ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ తరుణంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకెళ్లే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఇతర మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులను సమీకరించాలని కేంద్రం సూచించినట్టుగా చెబుతున్నారు. కానీ ప్రపంచ బ్యాంకు నుండి నిధుల సేకరణ ఆలోచన విరమించుకోవాలని తెలిపింది.

రాజధాని వాసులు కొందరు బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్ కు ఫిర్యాదు చేయటంతోనే నిర్ణయం
అమరావతి నిర్మాణం కోసం రూ. 7200 కోట్ల రుణం కోసం సీఆర్డీఏ ప్రపంచబ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. తొలి దశలో రూ. 3200 కోట్లు, రెండో దశలో రూ, 3200 కోట్లు తీసుకోవాలని అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. తొలి దశ రుణం తీసుకొనేందుకు నాడు కేంద్రం కూడ అంగీకరించింది. బ్యాంకు సూత్రప్రాయ ఆమోదంతో కొన్ని ప్రాధాన్య మౌలిక వసతుల కల్పన పనుల్ని సీఆర్డీఏ చేపట్టింది. అయితే ప్రపంచబ్యాంకు నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తున్నాయని రాజధానికి చెందిన కొందరు బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్‌కు 2017 మే 25న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రపంచబ్యాంకు టీమ్ అమరావతికి వచ్చింది.

ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైన జగన్ పరిస్థితి .. ఇది జగన్ కు పెను సవాలే
అమరావతిలోని అధికారులు, స్థానికులతో మాట్లాడింది. ఇక ఏపీకి వచ్చిన టీమ్ ప్రపంచబ్యాంకుకు ప్రాథమిక నివేదికను ఇచ్చింది. పూర్తి స్థాయి నివేదికకు ఇన్స్పెక్షన్ అవసరమని సిఫారసు చేసింది. ఇక ఇదంతా జరుగుతున్న ఈ సమయంలోనే ప్రభుత్వం మారింది. జగన్ సర్కార్ ఇప్పుడు ఈ వ్యవహారంలో సంకటంలో పడింది. ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ కు ఓకే చెప్పి నిధుల కోసం ప్రయత్నం చెయ్యాలా ? లేకా కేంద్రం మాట విని ప్రపంచ బ్యాంకు నుండి నిధుల సేకరణ విరమించుకోవాలా ? ఒక వేళ విరమించుకుంటే అమరావతి నిర్మాణానికి ఆర్ధిక వనరులు ఎలా? లేదు ఇన్స్పెక్షన్ కే మొగ్గు చూపితే కేంద్రం సూచనలు తీసుకోలేదనే పరిస్థితి వస్తుంది . కాబట్టి ఈ విషయమై తమకు గడువు కావాలని ప్రభుత్వం కోరింది. కానీ ప్రపంచ బ్యాంకు సమయం గురించి ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు . ఇక ఇప్పుడు అమరావతి నిర్మాణం విషయం జగన్ కు పెను సవాల్ గా మారింది .