ఢిల్లీకి అందుకేనా జగన్? మీకు అదే పని: యనమల, మాస్కులు పెట్టుకోనివ్వరంటూ లోకేష్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై విమర్శలు ఎక్కుపెట్టారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సంజాయిషీలు చెప్పడానికే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలు తప్ప.. రాష్ట్రానికి రావాల్సినవి సాధించడానికి కాదని విమర్శించారు.

చీవాట్లు తినడమే పనిగా పెట్టుకున్నారు..
రాష్ట్రంలో అరాచకాలు, అవినీతి చేయడం ఢిల్లీ వెళ్లీ చీవాట్లు తినడమే జగన్మోహన్ రెడ్డికి పనిగా మారిందని విమర్శించారు. తన కేసుల భవిష్యత్తే తప్ప రాష్ట్ర భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డికి పట్టదని అన్నారు. ప్రత్యేక హోదా పేరెత్తడం జగన్ మరిచిపోయి 15 నెలలు అయ్యిందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నోర్లు ఇప్పుడెందుకు మూతపడ్డాయని ప్రశ్నించారు. కోర్టులో ఉన్న అమరావతి అంశంపై పదే పదే కేంద్రాన్ని ఒత్తిడి చేయడం ఏంటని నిలదీశారు. ఇప్పటి వరకు జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లారు? 16 నెలల్లో కేంద్రం నుంచి ఏపీకి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అప్పుల్లో జగన్ ప్రపంచ రికార్డు..
అంతేగాక, 16 నెలల్లో రూ. 1.28 లక్షల కోట్లు అప్పులు తేవడమే జగన్ రికార్డని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. 31వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులతో చంద్రబాబు గిన్ని రికార్డు సాధిస్తే.. జగన్ మాత్రం నెలకు రూ. 8 వేల కోట్ల అప్పులు చేస్తూ ప్రపంచ రికార్డు సృష్టించారని యనమల ఎద్దేవా చేశారు. దేశంలోని టాప్-3లో ఉన్న ఏపీని ఇప్పుడు 21వ స్థానానికి పతనం చేశారని మండిపడ్డారు.
జగన్ మాస్కు పెట్టుకోరు.. పెట్టుకోనివ్వరు..
మరోవైపు టీడీపీ నేత నారా లోకేష్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఖరిపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ మూర్ఖత్వానికి మానవ రూపంగా మిగిలిపోయారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. సీఎం జగన్ మాస్కు పెట్టుకోరు.. మరొకరిని మాస్కులు పెట్టుకోనివ్వరని విమర్శించారు. చీరాలకు చెందిన దళిత యువకుడు కిరణ్ మాస్క్ పెట్టుకోలేదన్న కారణంతో పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి చంపడమెందుకని ప్రశ్నించారు. కిరణ్‌పై దాడికి మాస్క్ పెట్టుకోకపోవడం కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అని నిలదీశారు. తిరుమల పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌తో ఫొటో దిగేందుకు మాస్కు పెట్టుకుని వచ్చినవారిని మాస్కు తీసేయాలంటూ జగన్ ఆదేశించిన ఓ వీడియోను ట్వీట్ చేసి పై విధంగా వ్యాఖ్యలు చేశారు.