2024లో గుడివాడలో గెలవడానికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టనున్న టీడీపీ
విజయవాడ: గుడివాడలో ఎవరు శాసన సభ్యుడిగా ఉండాలనేది 2.10 లక్షల మంది ఓటర్లు నిర్ధారిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. అంతే తప్ప ఏ చంద్రబాబో, ఏ నారా లోకేషో లేదా రాబిన్ శర్మ లేకపోతే అమెరికాలో ఉంటూ ట్వీట్లు చేస్తోన్న నలుగురు పనికి మాలిన వ్యక్తులో కాదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి, గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సేమ్ రిజల్ట్ రిపీట్..
తనను ఓడించాని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. దీనికోసం 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. ఒక్క ఓటుకు 5,000 నుంచి 10,000 రూపాయలు పంచితే తమ పార్టీకి గుడివాడ ప్రజలు ఓటు వేస్తారనే భ్రమల్లో తెలుగుదేశం పార్టీ ఉందని విమర్శించారు. గతంలో దేవినేని అవినాష్‌ను టీడీపీ అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేయించినప్పుడు ఎలాంటి ఫలితం వచ్చిందో.. అదే పునరావృతం అవుతుందని కొడాలి నాని చెప్పారు.

చేయని ప్రయత్నం లేదు..
2014, 2019లో తనను ఓడించడానికి టీడీపీ చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదని కొడాలి నాని అన్నారు. 2014, 2019లో ఏం జరిగిందో.. 2024లో కూడా అలాంటి ఫలితాలే గుడివాడ నుంచి వస్తాయని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశ పడి ఓటు వేసే వాళ్లు గుడివాడలో ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. ఏ రూపంలో అయినా డబ్బులు ఖర్చు పెట్టినా గానీ టీడీపీకి ఓట్లు పడబోవని అన్నారు.

ప్రజలను మోసం..
తెలుగుదేశం పార్టీ తన హయాంలో రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిందని కొడాలి నాని అన్నారు. రైతులు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశాడని గుర్తు చేశారు. ఉన్నత చదువులను అభ్యసించే పేద విద్యార్థులకు వందశాతం ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేస్తానని మాట తప్పాడని అన్నారు. తాను అధికారంలోకి వస్తే పేదలందరికీ మూడు సెంట్ల స్థలాన్ని ఇస్తానని చంద్రబాబు నమ్మించి మోసం చేశాడని విమర్శించారు. ఇవన్నీ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాలేనని ధ్వజమెత్తారు.

కనీసం రూ.1,000 కోట్లు..
ఒక్క గుడివాడ నియోజకవర్గానికే చంద్రబాబు చేసిన మోసాల విలువ కనీసం 1,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని కొడాలి నాని అన్నారు. 2014లో ఇచ్చిన ఆ హామీల విలువ 2024 నాటికి 3,000 కోట్ల రూపాయలకు చేరుతుందని లెక్క గట్టారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే చంద్రబాబు ఓటర్లకు పంచే 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు సరిపోతాయా అని కొడాలి నాని ప్రశ్నించారు. అసలు కక్కాలంటేనే చంద్రబాబు 3,000 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఇంటింటికీ పంచాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు.