కరోనాను చంద్రబాబు ఎలా ఎదుర్కొన్నారంటే ? సీక్రెట్ బయటపెట్టిన విజయ సాయిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పేరు వినబడితే చాలు అంతెత్తున లేచే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి
తన నోటికి పని చెప్పారు. కరోనా సందర్భంగా చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితం కావడంపై అప్పట్లో తీవ్ర విమర్శలకు దిగిన సాయిరెడ్డి మరోసారి వాటిని గుర్తు చేసుకుంటూ చేసిన తాజా ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి.
రాఫెల్ జెట్లపై బీజేపీ ట్వీట్‌ను అందుకున్న సాయిరెడ్డి- ఇంకాస్త మసాలా వేసి చంద్రబాబుపై..
కరోనాను చంద్రబాబు ఎలా ఎదుర్కొన్నారన్న అంశాన్ని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి తన ట్వీట్లో నాలుగు పాయింట్ల ద్వారా బయటపెట్టారు. ఇందులో 8 నెలలుగా ఇంట్లో దాక్కోవడం ద్వారా అంటూ తొలి పాయింట్లో ప్రస్తావించారు. అలాగే తాను కనిపించకపోయినా బాబు వెన్నుపోటు పొడుస్తాడని కరోనా భయపడటం వల్ల అంటూ మరో పాయింట్లో చెప్పారు. తద్వారా కరోనాయే చంద్రబాబుకు భయపడిందనే అర్ధం వచ్చేలా సాయిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు.

మూడో పాయింట్లో కరోనాయే ఛీకొట్టి సామాజిక దూరం పాటించడం వల్ల చంద్రబాబు వైరస్‌ను ఎదుర్కొన్నారంటూ సాయిరెడ్డి మరో వ్యంగ్యాస్త్రం సంధించారు. నాలుగో పాయింట్లో చంద్రబాబు లోకేష్ అనే మహావీరుడి వల్ల కరోనాను ఎదుర్కొన్నారంటూ సాయిరెడ్డి మరో విమర్శకు దిగారు. దీంతో ఎప్పుడో ముగిసిపోయిన కరోనాలో చంద్రబాబు హైదరాబాద్ అధ్యాయాన్ని సాయిరెడ్డి మళ్లీ తిరగతోడేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది.