గీతం మంటలు: యూజీసీ చైర్మన్‌కు విజయసాయి లేఖ.. కేంద్రమంత్రికి కూడా, గుర్తింపు రద్దు చేయాలని..
గీతం వర్సిటీ నిబంధనల ఉల్లంఘన అంశంపై వివాదం కొనసాగుతోంది. వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి స్పందించారు. నిబంధనల ఉల్లంఘనపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఇంద్రపాల్ సింగ్‌కు లేఖ రాశారు. దీంతోపాటు కేంద్రమంత్రి రమేశ్ పొఖ్రియాల్‌కు కూడా లేఖ రాశారు. యూజీసీ చైర్మన్‌గా రాసిన లేఖలో.. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని వివరించారు.

వాస్తవాలు దాచి..
భూమి యాజమాన్య హక్కు పత్రాల సమర్పణలో వాస్తవాలు దాచారని తెలిపారు. యూజీసీకి ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ భూమిని కూడా గీతం యాజమాన్యం చూపించిందని చెప్పారు. ఫార్మసీ, మెకానికల్ విభాగాలు, సివిల్ విభాగ నిర్మాణాల్లో కొంత భాగం ప్రభుత్వ స్థలంలో ఉన్నాయని చెప్పారు. గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీగా ప్రజలకు వివరాలను బహిర్గతం చేయాలనే నిబంధన పాటించలేదన్నారు. గీతం భూములకు సంబంధించిన డాక్యుమెంట్ ఆధారాలను సంబంధిత అధికారులకు అందించలేదని వెల్లడించారు.

2007లో పర్మిషన్ తీసుకొని..
2007లో డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించేందుకు యూజీసీ అనుమతి తీసుకుందన్నారు. కానీ 2008లో హైదరాబాద్, 2012లో బెంగళూరు ఆఫ్ క్యాంపస్ సెంటర్లు ప్రారంభించిందని విజయసాయి తెలిపారు. నిబంధనల ఉల్లంఘన, డాక్యుమెంట్లు బహిర్గతం చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డిస్టన్స్ ఎడ్యుకేషన్, యూజీసి నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంగించిన గీతం యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని కోరారు..

కేంద్రమంత్రికి కూడా లేఖ
గీతం విద్యా విధానంలో లోపాలపై కేంద్రమంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంత్‌కు కూడా విజయసాయి రెడ్డి లేఖ రాశారు. ర్యాంకింగ్ విషయంలో గీతం నిబంధనలు పాటించలేదన్నారు. తప్పుడు సమాచారంతో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పొందిందని అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరులో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్ల విషయంలో నిబంధనలు పాటించలేదన్నారు. గీతం ఉద్యోగ నియామకాల్లో రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయలేదని తెలిపారు.

గోడ కూల్చడంతో వివాదం
విశాఖలో గల గీతం యూనివర్శిటీలో అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చి వేశారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని గీతం యాజమాన్యం ఆరోపిస్తోంది. అసలు ఎందుకు కూల్చుతోందో చెప్పడం లేదని అంటోంది. కూల్చివేతలపై గీతం హైకోర్టును ఆశ్రయించగా.. వర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. నవంబర్ 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తర్వాత తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.