మరో ప్రేమోన్మాది: పెళ్లికి అంగీకరించలేదని యువతి గొంతుకోసి, ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం: గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం మరువకముందే విశాఖపట్నంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాజాగా, యువతిపై ఓ ప్రేమోన్మాది దాడి చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.

యువతిపై కత్తితో దాడి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ ఫెర్రీ వీధికి చెందిన వాలంటీర్ ప్రియాంకపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రగాయాలపాలైన యువతిని కేపీహెచ్‌బీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇద్దరూ ప్రేమించుకున్నారు..?
ప్రియాంకపై శ్రీకాంత్ దాడి చేయడానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రియాంక, శ్రీకాంత్ గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కొన్ని ఫేస్బుక్లో దర్శనిమిచ్చాయి.

పెళ్లికి అంగీకరించకపోవడంతోనే...
ప్రస్తుతం ఈఎన్టీ వైద్యుల పర్యవేక్షణలో ప్రియాంకకు చికిత్స అందిస్తున్నారు. ఆమె గొంతు దగ్గర కోయడంతో తీవ్ర రక్తస్రావమైంది. నిందితుడు కూడా గొంతు కోసుకోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ప్రేమించానంటూ శ్రీకాంత్ వేధించాడని, పెళ్లికి అంగీకరించకపోవడంతోనే దాడి చేశాడని యువతి కుటుంబసభ్యులు తెలిపారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.