ఉండవల్లి శ్రీదేవి ఆడియో కలకలం ..ఎమ్మెల్యేగా అనర్హురాలని టీడీపీ నేత అనిత ఆగ్రహం
వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో చెలరేగిన వివాదం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఆమె చుట్టూ పలు వివాదాలు ముసురుకుంటున్నాయి. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తనుకు వైసిపి బహిష్కృత నేతలతో ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన క్రమంలో కొత్త ఆరోపణలు వెల్లువగా మారాయి. తాజాగా బయటపడిన శ్రీదేవి ఆడియోపై అనిత విచారణ జరిపించాలన్నారు . టీడీపీ నేత వంగలపూడి అనిత పేకాట క్లబ్బుల వాటాల్లో తేడానే ఈ వివాదాలకు కారణం అని మండిపడుతున్నారు . ఎమ్మెల్యేగా శ్రీదేవి అనర్హురాలని మండిపడుతున్నారు .
చీరల కొట్లో పని చేశారా, అంత కచ్చితంగా రేట్లు... విష్ణు వర్ధన్ రెడ్డికి అనిత అదిరిపోయే పంచ్

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆడియో లీక్ .. పేకాట క్లబ్బుల గురించి ?
తాజాగా లీక్ అయిన ఎమ్మెల్యే ఆడియోలో పేకాట క్లబ్బుల గురించి ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సంభాషణ సందీప్ తో ఎమ్మెల్యే శ్రీదేవి చేసినట్టుగా తెలుస్తుంది. పేకాట క్లబ్బులు నిర్వహిస్తే కమీషన్ వస్తుందంటూ అందులో ఎమ్మెల్యే మాట్లాడినట్టు సమాచారం . తాజాగా వైసీపీ బహిష్కృత నేత కార్యకర్త శృంగారపాటి సందీప్ కూడా ఎమ్మెల్యే పై తీవ్ర ఆరోపణలు చేశారు . ఎమ్మెల్యే శ్రీదేవి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సందీప్ సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పు ఇప్పిస్తే తిరిగి ఇవ్వకుండా తన పైన తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సందీప్ సెల్ఫీ వీడియో ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ నాయకులకు అనుకూలంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి , వైసీపీ బహిష్కృత కార్యకర్తల ఆరోపణ
శృంగారపాటి సందీప్, చలివేంద్రం సురేష్ లను ఇటీవల వైసిపి నుండి బహిష్కరించారు. వీరిరువురు ఎమ్మెల్యే పైన, అలాగే ఎంపీ నందిగం సురేష్ పైన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ సురేష్ ఇద్దరు టిడిపి నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సందీప్ ,సురేష్ లు పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుతం ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారగా ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం దొరికినట్లయింది.

ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే పదవికి అనర్హురాలు.. ఫైర్ అయిన అనిత
వైసిపి మహిళ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీరుపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్న ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే పదవికి అనర్హురాలు అంటూ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పోటాపోటీగా పేకాట క్లబ్ లు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని మండిపడ్డారు. ఉండవల్లి శ్రీదేవి ఆడియో క్లిప్పింగ్స్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు వంగలపూడి అనిత.

వాటాలలో తేడా రావటంతో శ్రీదేవి నాటకాలు ఆడుతున్నారన్న టీడీపీ మహిళా నాయకురాలు
పేకాట క్లబ్బుల నిర్వహణలో ఇదంతా వాటాల పంపిణీలో తేడాలు రావడంతో బయటపడిన వివాదం అని ఆమె అభిప్రాయపడ్డారు . ఉండవల్లి శ్రీదేవి ప్రాణహాని పేరుతో ఆడుతున్న కొత్త నాటకం అంటూ ఆరోపణలు గుప్పించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వంగలపూడి అనిత.
ఇప్పుడు వైసీపీలో కూడా ఉండవల్లి శ్రీదేవి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.