డాక్టర్ సుధాకర్ కేసులో కీలక పరిణామం- సర్కారీ విచారణ- మళ్లీ విధుల్లోకి ?
కరోనా సమయంలో విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తూ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి రచ్చకెక్కిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం మరిన్ని మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే సుధాకర్ విషయంలో ప్రభుత్వం గతంలో చేసిన ఆరోపణలు, ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలు, తదనంతర పరిణామాలపై సీబీఐ ఇచ్చిన నివేదికను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో త్వరలో మరో దర్యాప్తు ప్రారంభం కాబోతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా గతంలో సుధాకర్ చేసిన ఆరోపణలపై తాజాగా శాఖాపరమైన దర్యాప్తు నిర్వహించింది. దీంతో ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
డాక్టర్ సుధాకర్ కేసులో ట్విస్టులు- యూటర్న్ ఒప్పుకోని హైకోర్టు- సీబీఐతో మరో దర్యాప్తు

డాక్టర్ సుధాకర్ కేసులో ట్విస్టులు
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్తీషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో తగినన్ని మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి. ప్రభుత్వం వీటిపై స్పందించి ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన మానసిక స్ధితి సరిగా లేదంటూ పిచ్చాసుపత్రికి పంపడం, పిచ్చివాడిగా ముద్రవేయడం, ఈ వ్యవహారంలో విపక్షాలు రంగంలోకి దిగి హైకోర్టుకు ఆధారాలు ఇవ్వడం, వాటి ఆధారంగా సీబీఐ దర్యాప్తు చకచకా జరిగిపోయాయి. అయితే సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే సుధాకర్ యూటర్న్ తీసుకున్నారు.

సుధాకర్‌పై శాఖాపరమైన విచారణ
ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణలపై సస్పెన్షన్ విధించిన అధికారులు.. ఇన్నిరోజులుగా శాఖాపరమైన విచారణ మాత్రం నిర్వహించలేదు. సస్పెన్షన్ తర్వాత సుధాకర్ ఆస్పత్రిలో చేరడం, పోలీసు కేసులు, ఇతరత్రా కారణాలతో ఆయనపై విచారణ నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆదేశాలతో విశాఖ జిల్లా అధికారులు తాజాగా ఆయనపై శాఖాపరమైన విచారణ నిర్వహించారు. ప్రభుత్వంపై విమర్శలకు దారి తీసిన పరిస్ధితులపై ఆయన నుంచి రాతపూర్వక వివరణ తీసుకున్నారు. ఇందులో ఆయన కూడా ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే ఉద్దేశమేదీ లేదని వివరణ ఇచ్చారు. దీన్ని ప్రభుత్వానికి సమర్పించి ఆయన సస్పెన్షన్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు కోరనున్నారు.

ఉద్యోగం లేక వేదన అనుభవిస్తున్న సుధాకర్
మెడికల్ కౌన్సిల్ అధికారులు నిర్వహించిన శాఖాపరమైన విచారణలో పాల్గొన్న తర్వాత మాట్లాడిన డాక్టర్ సుధాకర్ తన పరిస్ధితి దారుణంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయాలని ప్రభుత్వ ఉద్యోగంలో చేరానని, రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వైఎస్ పాదయాత్రలో కూడా తాను పాల్గొన్నానన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఉద్దేశం లేదన్నారు. తన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని సుధాకర్ తెలిపారు. ఆరు నెలలుగా ఉద్యోగం లేదని, ఆరోగ్యం కూడా దెబ్బతిందని, పిచ్చివాడిగా ముద్ర వేశారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే విధుల్లోకి తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విధుల్లోకి తీసుకునే అవకాశం
డాక్టర్ సుధాకర్ కరోనా సమయంలో చేసిన ఆరోపణలపై అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. ఆయన్ను టీడీపీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు దగ్గరి వాడిగా కూడా ఆరోపించింది. ఆ తర్వాత తనను ప్రభుత్వం ఇబ్బందిపెడుతోందంటూ టీడీపీ నేతలను ఆయన ఆశ్రయించడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వంలో ఉన్న కొందరి సలహాతో ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. ముఖ్యమంత్రిపై తనకు గౌరవం ఉందని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఆలోచన లేదని లిఖితపూర్వకంగా వివరణ కూడా ఇచ్చారు. అటు సీబీఐ విచారణలోనూ డాక్టర్ సుధాకర్ తన వ్యవహారంలో ప్రభుత్వం తప్పేమీ లేదన్నారు. దీంతో ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని సుధాకర్‌ను విధుల్లోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. గతంలో సస్పెన్షన్ విధించినందున శాఖాపరమైన విచారణ పూర్తి చేస్తే కానీ తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఆ తంతును కూడా ప్రభుత్వం పూర్తి చేస్తోంది.