యాపిల్ అంటే కశ్మీరే కాదు... తెలుగు రాష్ట్రాలు కూడా..! ఏపీలో ఆజిల్లాలో యాపిల్ సాగు..!
విశాఖపట్నం: సాధారణంగా యాపిల్ సాగు అంటే అందరికీ గుర్తొచ్చేది కశ్మీర్ లేదా హిమాచల్ ప్రదేశ్. ఎందుకంటే యాపిల్ సాగుకు చల్లటి వాతావరణం అవసరం. చల్లటి వాతావరణంలోనే ఈ పంట పడుతుంది. అందుకే కశ్మీర్ యాపిల్, షిమ్లా యాపిల్ అని చెబుతుంటారు. అయితే యాపిల్ అంటే కశ్మీర్ షిమ్లా అనే మాట ఒకప్పుడు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ రైతు యాపిల్ పంటను సాగు చేశాడు. ఇది నిన్నటి మాట. నేడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా యాపిల్ పంటను సాగు చేస్తున్నారనేది తాజా వార్త. ఇంతకీ ఏపీలో యాపిల్ పంట సాగుకు అనువైన వాతావరణం ఎక్కడ ఉంది..?

నిన్న తెలంగాణలో.. నేడు ఏపీలో
యాపిల్ అంటే టక్కున గుర్తొచ్చేది కశ్మీర్ లేదా షిమ్లా. ఎందుకంటే యాపిల్స్ ఎక్కువగా అక్కడే పండుతాయి. ఇందుకు కారణం యాపిల్ సాగుకు కావాల్సిన అనువైన వాతావరణం అక్కడ ఉంటుంది. అయితే యాపిల్ అక్కడే కాదు ఎక్కువగా ఎండలు కాసే తెలంగాణలో కూడా పండుతాయని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం రైతు బాలాజీ నిరూపించాడు. ఆయన తన తోటలో యాపిల్ పంటను సాగు చేసి పండిన యాపిల్ పండ్లను సీఎం కేసీఆర్‌కు కూడా ఇచ్చాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో కూడా యాపిల్ పంట సాగవుతోంది.

విశాఖ ఏజెన్సీలో యాపిల్ సాగు
విశాఖపట్నం జిల్లా కొండ ప్రాంతమైన చింతపల్లి జీకే వీధి మండలాల్లో యాపిల్ సాగు మంచి ఫలితాలను ఇస్తోంది. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో ఉండే చింతపల్లి జీకేవీధి, పాడేరు, అరకులోయల్లోని ఏజెన్సీ ప్రాంతాలు యాపిల్ సాగుకు అనువైన ప్రాంతంగా నిలుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కశ్మీర్‌గా పిలువబడే లంబసింగిలోని వాతావరణం యాపిల్ సాగుకు సరిగ్గా ఉంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో సాగయ్యే యాపిల్ చెట్లకు పండ్లు కూడా కాసేశాయి. ఇక రెండు వెరైటీల యాపిల్ చెట్లు ఇక్కడ పెరిగాయని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. ఈ యాపిల్స్ కాస్త రసం ఎక్కువగా ఉండటంతో పాటు కొంచెం పుల్లగా కూడా ఉన్నాయని వెల్లడించారు.

ఒక్కో యాపిల్ బరువు 300 నుంచి 400 గ్రాములు
విశాఖ ఏజెన్సీలోని దమనపల్లి పంచాయతీ కింద ఉన్న మడెం అనే గిరిజన గ్రామంలో యాపిల్ తోటను పెంచారు. ఒక్కో చెట్టుకు 30 నుంచి 34 యాపిల్ పండ్లు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం పాడేరు ఐటీడీఏలో అధికారులు యాపిల్ మొక్కలను కొంతమంది ఎంపిక చేయబడ్డ రైతులకు అందజేసి యాపిల్ పెంపంకంను వినూత్న ప్రయోగం కింద చేపట్టారు. ఇక ఈ ఏడాది ఈ యాపిల్ చెట్లకు పండ్లు కాశాయని ఒక్కో యాపిల్ బరువు 350 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు ఉందని ఐటీడీఊ పాడేరు అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఈ యాపిల్ సాగు విశాఖ ఏజెన్సీలోని మండలాల్లో 60 నుంచి 70 ఎకరాల్లో సాగులో ఉంది.

200 ఎకరాల్లో సాగు చేయాలని భావిస్తున్న అధికారులు
ఇక యాపిల్ సాగు మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈ పంట సాగును 200 ఎకరాల వరకు విస్తరించాలని ఐటీడీఏ అధికారులు చెప్పారు. ఇందకు రూ.3.2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. యాపిల్ పంట సాగుకు చింతపల్లి, జీకే వీధి, అరకు లోయ మండలాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. మడెం గ్రామంలో పండిన యాపిల్ పండ్లు మంచి సైజు, రంగు, రుచి, మరియు వాసన కలిగి ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో విశాఖ ఏజెన్సీలో పండే యాపిల్స్‌ను నగరాలకు తీసుకెళ్లి విక్రయిస్తామని చెప్పారు. ఇక యాపిల్ సాగును పాడేరు ఐటీడీఏ పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని భావిస్తోందని చెప్పారు మరో రైతు.