విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం బీజేపీ నేతల పాట్లు .. నేడు అమిత్ షా ను కలవనున్న బీజేపీ ప్రతినిధి బృందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయం తీసుకుని కేంద్రం ఏపీ బీజేపీ నేతలను కష్టాల్లోకి నెట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ వేదికగా ఉద్యమం తీవ్రతరం అవుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కొనసాగుతున్న ఉద్యమానికి అఖిలపక్ష నేతలు తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం చేయాల్సిన బాధ్యత బిజెపి నేతల పై పడింది.

నేడు అమిత్ షా ను కలవనున్న బీజేపీ ప్రతినిధుల బృందం
ఈరోజు ఢిల్లీలో ఉన్న బిజెపి నేతల బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై అమిత్ షా తో చర్చించనున్నారు . నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసిన బిజెపి ప్రతినిధి బృందం, స్టీల్ ప్లాంట్ విషయంపై ఆయనతో చర్చించారు. జేపీ నడ్డా అమిత్ షాతో కలిసి ఈ విషయంపై చర్చించాలని సూచించడంతో, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించిన బీజేపీ నేతలకు నేడు మధ్యాహ్నం అమిత్ షా అపాయింట్మెంట్ లభించింది. దీంతో విశాఖ ప్రజల మనోభావాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బిజెపి ప్రతినిధుల బృందం అమిత్ షా కు విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కేంద్రంపై ఏపీ బీజేపీ నేతల ఒత్తిడి .. ఢిల్లీ వెళ్ళిన బీజేపీ నేతల బృందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మనోభావాలకు తగినట్లుగా బీజేపీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయాన్ని పునరాలోచించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీకి వెళ్లారు . రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని కేంద్రానికి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్ర పెద్దలతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ నేతలు ప్రైవేటీకరణ నిర్ణయానికి తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను స్వాగతిస్తున్నామని చెబుతూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకోవాలని వారు కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టారు.

ఉక్కు శాఖామంత్రికి , బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాకు బీజేపీ నేతల వినతి
ఈ మేరకు నిన్న ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసిన బీజేపీ నేతల బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించ వద్దని విజ్ఞప్తి చేసింది . విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజల సెంటిమెంట్ ను మంత్రికి వివరించి, పునరాలోచించాలని కోరారు.
అంతేకాదు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలుగు ప్రజల భావోద్వేగ సంబంధాన్ని ఆయనకు తెలియజేశారు . స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని జేపీ నడ్డా దృష్టికి తీసుకువెళ్లారు.

మొన్న జనసేన , ఇప్పుడు బీజేపీ .. విశాఖ ఉక్కు కోసం ఢిల్లీ బాట
ఈరోజు అమిత్ షా తో బిజెపి ప్రతినిధుల బృందం భేటీ కానుంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటుగా కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి ,ఎమ్మెల్సీ మాధవ్ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఢిల్లీ వెళ్లి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు విషయంలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర పెద్దలను సంప్రదించారు. ఇప్పుడు బీజేపీ కూడా రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేసి ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది.