వైసీపీ ఎంట్రీపై వెనక్కి తగ్గిన గంటా ?- సోము మంత్రాంగం, మెగా సలహాతో బీజేపీ చూపులు..
విశాఖపట్నం : సరిగ్గా పది రోజుల క్రితం వరకూ వైసీపీలోకి టిడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ చేరిపోవడం ఖాయమనే అంతా భావించారు. వైసీపీలో గంటా చేరికకు ఆగస్టు 16న ముహుర్తం కూడా కుదిరింది. వాస్తవానికి ఆయన అదే రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి వైసీపీకి మద్దతు ప్రకటిస్తారని భావించినా అలా జరగలేదు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇవాళ్టి వరకూ ఆయన మౌనంగానే ఉంటున్నారు. అలాగని టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అంటే అదీ లేదు. ఇతర ఎమ్మెల్యేల్లా విమర్శలు చేస్తున్నారా అంటే అదీ కాదు. దీంతో రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన గంటా మనసులో మరో ప్లాన్ ఏదో రెడీ అవుతోందనే ప్రచారం ఊపందుకుంది.

వైసీపీలోకి గంటా ఎంట్రీకి బ్రేక్...?
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి ప్రస్తుతం ఎమ్మెల్యేల అవసరం లేదు. అయినప్పటికీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ఓ దశలో వైసీపీలోకి గంటా చేరిక లాంఛనమేనని అంతా భావించారు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఇక రాజకీయాలెందుకు అన్న చందాన చివరి నిమిషంలో ఈ ఎంట్రీకి బ్రేక్ పడిపోయింది. ఈ బ్రే్క్ వైసీపీ వేసిందా లేక తనంతట తానుగా గంటా వేసుకున్నారా తెలియదు కానీ మొత్తానికి ఆయన వైసీపీలోకి రావడం తృటిలో తప్పిపోయింది. దీంతో అప్పటికే విశాఖలో ఆయన ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేతలంతా ఇప్పుడు ఊపిరిపీల్చుకుంటున్నారు.

తెరవెనుక ఏం జరిగింది ?
వైసీపీలోకి గంటా శ్రీనివాసరావు చేరిక ఖాయమని గత నెలలో సంకేతాలు రావడంతో విశాఖలో ఆయన ఒకప్పుటి శిష్యుడు, ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ భగ్గుమన్నారు. విశాఖలో భూకబ్జాల ఆరోపణలు ఉన్న గంటాను పార్టీలోకి ఎలా రానిస్తారంటూ ఏకంగా అధిష్టానంపైనా స్వరం పెంచారు. ప్రస్తుతం విశాఖ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఆయనకు తోడయ్యారు. అప్పటికే గంటా చేతిలో ఓటమి పాలైన వైసీపీ నేత కేకే రాజును వచ్చే ఎన్నికల అభ్యర్ధిగా ప్రకటించేయడంతో పాటు ఆయన ఓటమి పాలైనా కార్యకర్తలతో కలిసి పార్టీ కోసం శ్రమిస్తున్నారంటూ కితాబులు కూడా ఇచ్చేశారు. దీంతో పరిస్ధితిని గమనించిన గంటా వైసీపీలోకి తన ఎంట్రీ డైలమాలో పడినట్లు తెలుస్తోంది.

సోము రాక- మెగా సలహా...
గంటా డైలమాను గమనించిన బీజేపీ కొత్త అధ్యక్షుడు చేపట్టిన సోము వీర్రాజు ఇదే అదనుగా రంగంలోకి దిగారు. కాపు మార్క్‌తో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న సోముకు గంటా కనిపించారు. అంతే మరో స్టోరీ మొదలైంది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా ఓసారి బీజేపీలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేసిన గంటా శ్రీనివాస్‌కు ఈసారి సోము వీర్రాజు రాకతో పరిస్ధితులు కాస్త సానుకూలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాపు ఫ్యాక్టర్ అండతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న సోముకు ఇప్పుడు గంటా వంటి నేతలు తక్షణావసరం. అయితే గంటాను బీజేపీలోకి తీసుకురావడం ద్వారా ఎదురయ్యే పరిణామాలు, వాటిని ఎదుర్కోవాల్సిన తీరుపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నట్లు సమాచారం.

గంటాకు మెగాస్టార్ సలహా...
ఒకప్పటి తన ప్రజారాజ్యం గురువు చిరంజీవి అడుగుజాడల్లోనే గంటా శ్రీనివాసరావు నడుస్తుంటారు. ఆయన సలహాలు ఇప్పటికీ పాటిస్తుంటారు. వైసీపీలోకి ఎంట్రీ ప్రయత్నాల వెనుక కూడా చిరంజీవి ఉన్నట్లు ప్రచారం జరిగింది. చివరికి ఇప్పుడు వైసీపీని కాదని గంటా శ్రీనివాస్ బీజేపీ వైపు మొగ్గు చూపడంలోనూ చిరంజీవి పాత్ర కీలకమే. వైసీపీలో రాజకీయాలతో డైలమాలో పడ్డ గంటాను బీజేపీలోకి తీసుకొచ్చే విషయంలో సోము వీర్రాజు మెగా సాయం తీసుకున్నట్లు సమాచారం. మెగాస్టార్‌తో తనకున్న సాన్నిహిత్యం, ఇతరత్రా కారణాలతో గంటాను బీజేపీలోకి పంపే బాధ్యతను సోము వీర్రాజు ఆయనపై పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం విశాఖలోని కాపు నేతలు, గంటా వ్యతిరేకులు వైసీపీలో ఉన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీలోకి వెళ్లి వాళ్లతో యుద్ధం చేయడానికి బదులు బీజేపీలో చేరితే అది కనీసం రాజకీయ ప్రత్యర్ధుల పోరుగా ఉంటుందని మెగాస్టార్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.