గంటా శ్రీనివాస్ అనుచరుడికి జీవీఎంసీ షాక్ .. అనుమతి లేదని ఆ నిర్మాణాల తొలగింపు
విశాఖలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. టీడీపీ నేతల ఆక్రమణలపై దృష్టి సారించిన సర్కార్ తాజాగా గంటా అనుచరుడిని టార్గెట్ చేసింది . విశాఖ భీమిలి బీచ్ రోడ్ లో ఉన్న మంగమ్మ వారి పేట కూడలి వద్ద నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు. విశాఖలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై కొరడా ఝళిపిస్తున్న ప్రభుత్వం తాజాగా టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడైన కాశీవిశ్వనాథ్ కు చెందిన గో కార్ట్ రేసింగ్, హబ్ ఫర్ యూత్ నిర్మాణాలను తొలగిస్తున్నారు.

కాపులుప్పాడ లోని గో కార్ట్ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు
తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా నిర్మాణాలు తొలగిస్తున్నారని గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాపులుప్పాడ లోని మంగమ్మ వారి పేట లో కాశీ విశ్వనాథ్ అధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటున్న అధికారులు జీవీఎంసీ డిసిపి రాంబాబు నేతృత్వంలో అక్కడికి చేరుకుని ప్రొక్లెయిన్ లతో రేకుల షెడ్ల ను ధ్వంసం చేయించారు. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోడలు షెడ్ లను తొలగించారు.

అనుమతుల్లేకుండా గో కార్ట్ నిర్వహణ.. అందుకే కూల్చివేతలు
సీఆర్ జెడ్ పరిధిలో అనుమతి లేకుండా నిర్మించిన కారణంగా తొలగించామని జీవీఎంసీ డీసీపీ రాంబాబు తెలిపారు. సముద్రతీరానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు చెప్తున్నారు. వుడా పరిధిలో ఉన్న గో కార్ట్ గ్రూపు నిర్మాణాలకు సంబంధించి జీవీఎంసీ అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, అనుమతి లేకుండానే ఏళ్ళతరబడి దీనిని నిర్వహిస్తున్నారు.
గో కార్ట్ నిర్వాహకులైన కాశీవిశ్వనాథ్ వ్యవహారాలపై చాలా ఆరోపణలు ఉన్నాయని తెలుస్తుంది.

గంటా శ్రీనివాసరావు అనుచరుడుగా కాశీ విశ్వనాథ్ పై పలు ఆరోపణలు
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడుగా ఆయన పలు అనధికారిక వ్యవహారాలకు పాల్పడ్డాడని పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో రుషికొండ టూరిజం ప్రదేశంలో రేవ్ పార్టీ నిర్వహించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. కాశీ విశ్వనాథ్ కుమారుడి పై డ్రగ్స్ కేసు కూడా నమోదు అయినట్లుగా సమాచారం. విశాఖ నగరంలో ముఖ్యంగా టీడీపీ నాయకులను టార్గెట్ చేసి మరీ కక్ష పూరితంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు గుప్పిస్తున్నా జీవీఎంసీ అధికారులు మాత్రం కూల్చివేతలను కొనసాగిస్తున్నారు .

నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారంటూ కాశీనాథ్ ఆవేదన
సర్వేనెంబర్ 299/1 ,301 లో నాలుగు ఎకరాల 48 సెంట్లలో కట్టిన నిర్మాణాలను కూల్చి వేసిన అధికారులు నోటీసులు ఇవ్వలేదంటూ కాశీ విశ్వనాథ్ ఆరోపిస్తున్నారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయడం పై గో కార్టింగ్ నిర్వాహకులు, ఆనంద అసోసియేట్స్ అధినేత అయిన కాశీ విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు స్థలం లీజుకు తీసుకొని ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయకుండా నిర్వహిస్తున్నామని చెప్పిన ఆయన, మూడు కోట్ల విలువైన వినోద , క్రీడా సామాగ్రిని జీవీఎంసీ సిబ్బంది ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నారు.