బెంజి కారు ఇష్యూలో కీలక మలుపు: తెరపైకి కార్తీక్, అసలేం జరిగిందంటే..
బెంజి కార్ గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. ఈఎస్ఐ స్కాంలో ఏ-14 నిందితుడు కార్తీక్.. మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ ఉండటంతో పెను దుమారం రేపింది. తొలుత అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేయగా.. మంత్రి జయరాం, ఈశ్వర్ స్పందించారు. కారు ఈశ్వర్ పేరుతో ఉంటే రాజీనామా చేస్తానని జయరాం సవాల్ కూడా విసిరారు. ఇదిలా ఉంటే ఇవాళ కార్తీక్ తెరపైకి వచ్చారు. జరిగింది ఏంటో పూస గుచ్చి మరీ వివరించారు.

బెంజి కారు ఎవరికీ గిప్ట్ ఇవ్వలేదు..
బెంజి కారు తాను ఎవరికీ బహుమతిగా ఇవ్వలేదని కార్తీక్ స్పష్టంచేశారు. లేనిది ఉన్నట్టు ఊహించుకొని ప్రచారం చేయడం తగదన్నారు. మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ స్నేహితుడు అని తెలిపారు. అందులో భాగంగానే కొత్త కారు కొని ఈశ్వర్ చేతుల మీదుగా తీసుకున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాదు గతేడాది డిసెంబర్లో కారు కొనుగోలు చేశానని తెలిపారు. ఈఎస్ఐ స్కామ్ కేసు 2020 ఏప్రిల్‌లో కేసు నమోదు జరిగిందని చెప్పారు. జులైలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అలాంటి సమయంలో తాను కారు కొనుగోలు చేసి గిప్ట్ ఎలా ఇస్తా అని ప్రశ్నించారు.

1.50 కోట్ల బకాయి..
తనకు ప్రభుత్వం నుంచి రూ.1.50 కోట్లు బకాయి రావాల్సి ఉంది కార్తీక్ వివరించారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్టు అవడతో ఈఎంఐ చెల్లించడం వీలుకాలేదన్నారు. దీంతో కారు సీజ్ చేశారని.. ప్రస్తుతం కారు హైదరాబాద్‌లోని పంజాగుట్ట ననేశ్ ఫైనాన్స్ కంపెనీ ఆధీనంలో ఉందని తెలిపారు. ఒకవేళ మంత్రికి కారు బహుమతి ఇస్తే కారు ఫైనాన్స్ వారి దగ్గర ఎలా ఉంటుందని అడిగారు. బెంజి కారు గిఫ్ట్ ఇచ్చాను అనేది అసత్య ఆరోపణలు అని అని ఖండించారు.

అయ్యన్నపాత్రుడు ఆరోపణలు..
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ స్కాంలో ఏ-14 నిందితుడు మంత్రి కుమారుడికి కాస్ట్లీ కారు కొనిచ్చారని ఆరోపణలు చేశారు. మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు.. తెలకపల్లి కార్తీక్ కారు అందజేసిన ఫోటోలను మీడియాకు చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు ప్రేవేశపెట్టిన 11440కు లైవ్‌లో కాల్ చేసి మంత్రి కుమారుడు ఈశ్వర్‌పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఏ-14 నిందితుడు
ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన ఏ-14 నిందితుడు కార్తీక్ అని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈశ్వర్ బర్త్ డే రోజున బెంచ్ కారు ఇచ్చారని, దానికి సంబంధించిన ఫోటోలను చూపారు. కారును ఎందుకు గిప్ట్గా ఇచ్చారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ-14 కార్తీక్.. మంత్రి జయరాంకు బినామీ అని ఆరోపించారు. అందుకోసమే పుట్టినరోజు సాకు చూపి.. మంత్రికి లంచం ఇచ్చారని ఆరోపించారు. వాస్తవానికి కార్మిక శాఖలో అవినీతికి పాల్పడింది మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కాదని.. మంత్రి జయరాం అని ఆరోపించారు. దీనిపై మంత్రి జయరాం కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో కార్తీక్ మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని వివరించాడు.