కృష్ణాబోర్డుపై జగన్‌కు షాకిచ్చిన కేసీఆర్- విశాఖకు తరలింపుపై అభ్యంతరం- బోర్డుకు లేఖ
కృష్ణా నదీ జలాల పంపకాల విషయంలో ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తీవ్ర జల జగడాలు ఉన్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ విషయంలోనూ తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు చెబుతోంది. ఇదే క్రమంలో మరో జగడం కూడా వచ్చి చేరింది. ఈసారి ప్రాజెక్టులపై కాకుండా, వాటి నిర్వహణ చేపట్టాల్సిన కృష్ణాబోర్డు విషయంలో ఈ జగడం నెలకొనడం విశేషం. గతంలో హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించిన కృష్ణా నదీ బోర్డు కార్యాలయాన్ని ఇప్పుడు వైసీపీ సర్కారు కొత్త రాజధాని విశాఖకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం.

విశాఖకు కృష్ణాబోర్డు ఆఫీసు..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కీలకమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఏడాది క్రితమే హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఏపీ ప్రభుత్వం కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర జలవనరులశాఖ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఆ తర్వాత వైసీపీ సర్కారు మా రాజధాని విజయవాడ కాదు విశాఖ కాబట్టి ఈసారి అక్కడికి తరలించాలని కోరుతోంది. కీలకమైన కృష్ణాబోర్డు కార్యాలయం రాజధాని ప్రాంతం నుంచి పనిచేస్తేనే బావుంటుందని వైసీపీ సర్కారు చెబుతోంది. కానీ దీనిపై ఏపీలోనే వ్యతిరేకత వస్తోంది.

తరలింపుపై సర్వత్రా వ్యతిరేకత
గతంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు కృష్ణాబోర్డు తరలింపును స్వాగతించిన వారంతా ఇప్పుడు విశాఖకు తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో విపక్షాలన్నీ వైసీపీ సర్కారు నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి.
అఠు కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ వైసీపీ ప్రభుత్వ నిర్ణయం నచ్చలేదు. గతంలో విజయవాడకూ, కృష్ణానదికి ఉన్న అవినాభావ సంబంధం ఆధారంగా హైదరాబాద్ నుంచి మార్చేందుకు ఒప్పుకున్నామని, కానీ ఇప్పుడు సంబంధంలేని విశాఖకు ఎలా తరలిస్తారని అంతా ప్రశ్నిస్తున్నారు.

జగన్‌కు షాకిచ్చిన కేసీఆర్
గతంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల విషయంలో కలిసి కూర్చుని చర్చించుకుందామని ప్రతిపాదించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కొంతకాలంగా రివర్స్ అవుతున్నారు. జగన్ సర్కారు ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. అటు తెలంగాణల విపక్షాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయాలను ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అక్రమ ప్రాజెక్టులంటూ ఏపీలో నిర్మాణాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కేసీఆర్... ఇప్పుడు కృష్ణాబోర్డు కార్యాలయం తరలింపునూ వ్యతిరేకిస్తున్నారు. దీంతో తెలంగాణ సర్కారు మద్దతు లేనిదే ఇరు రాష్ట్రాలకూ అవసరమైన ఈ ఆఫీసును విశాఖ తరలించడం కష్టంగా మారనుంది.

విశాఖలో వద్దంటూ కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ
విశాఖకు కృష్ణాబోర్డు తరలింపు తమకు సమ్మతం కాదని తెలంగాణ సర్కారు తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ తెలంగాణ జలవనరులశాఖ అధికారులు కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. కృష్ణా బేసిన్‌కు సంబంధం లేని విశాఖలో బోర్డు కార్యాలయం పెడితే కార్యకలాపాలకు ఇబ్బంది అవుతుందని ఈ లేఖలో ఫిర్యాదు చేశారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో కూడా చెప్పకుండా ఏకపక్షంగా వైసీపీ సర్కారు దీనిపై నిర్ణయం తీసుకుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. దీంతో పాటు అనుమతుల్లేకుండా ఏపీ సర్కారు మరో మూడు ప్రాజెక్టులు నిర్మిస్తోదంటూ మరో ఫిర్యాదు కూడా చేసింది.