మొన్న రోజా..ఇవ్వాళ రజిని: విశాఖ శారదా పీఠానికి మహిళా మంత్రులు
విశాఖపట్నం: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశాఖ శ్రీశారదా పీఠంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ముందు నుంచీ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ వైఎస్ జగన్కు మద్దతుగా ఉంటోన్నారు. ఆయనకు అండగా నిలిచారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన శారదాపీఠాన్ని సందర్శించిన సందర్భాలు ఉన్నాయి. స్వరూపానందేంద్ర స్వామి సూచనల మేరకు ఇదివరకు యాగం సైతం నిర్వహించారు.
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీశారదా పీఠంతో ఉన్న ఆ అనుబంధం మరింత బలపడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైఎస్ జగన్ స్వయంగా ఈ పీఠాన్ని సందర్శించారు. స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం తేదీ, సమయాన్ని కూడా ఆయనే ఖరారు చేశారనే వార్తలు కూడా లేకపోలేదు. శారదాపీఠం వార్షికోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు.

అదే ఆనవాయితీని ఇప్పుడు కొత్త మంత్రులు కూడా పాటిస్తున్నట్టే కనిపిస్తోంది. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన రోజా రెండు రోజుల కిందటే శారదా పీఠాన్ని సందర్శించారు. స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఆమె తమిళనాడులోని అరుణాచలం, కంచిని సందర్శించారు. అనంతరం విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంగా శారదా పీఠాన్ని సందర్శించారు.

ఇప్పుడు తాజాగా- వైద్య-ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కూడా శారదా పీఠాన్ని సంద్శించారు. ఆమె విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా. జిల్లా పర్యటన సందర్భంగా శారదా పీఠానికి వెళ్లారు. స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా విడదల రజిని విశాఖకు వచ్చారు. వైద్య ఆరోగ్య శాఖను సమర్థవంతంగా నిర్వహించేలా దీవించాలని కోరారు. రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
