andhra pradesh visakhapatnam Visakhapatnam Steel Plant ap govt privatisation ys jagan letter విశాఖపట్నం ఏపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ లేఖ
పోస్కోకు జగన్ సర్కార్ ఆహ్వానం వెనుక ?- స్టీల్ ఉద్యమ సెగ- విశాఖలో ఎదురీతే కారణమా ?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏపీలో కాకరేపుతోంది. అసలే ఎన్నికల వేళ వైజాగ్ స్టీల్ ఉద్యమాల సెగ వైసీపీకి గట్టిగానే తగులుతోంది. ఎన్నికల పోలింగ్ లోపు ఏదో ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటే తప్ప అక్కడ గట్టెక్కలేమన్న భయం వైసీపీని వెంటాడుతోంది. దీంతో కేంద్రం ప్రైవేటీకరణలో భాగంగా పోస్కో ఇండియాకు వైజాగ్ స్టీల్ ఆశచూపుతున్న నేపథ్యంలో అదే సంస్ధను కృష్ణపట్నంలో గ్రీన్‌పీల్డ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కార్ లేఖ రాసింది. దీంతో వైజాగ్‌కు బదులుగా పూర్తిస్ధాయిలో కొత్త సంస్ధ పెట్టేందుకు ఆఫర్ ఇచ్చినట్లయింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సెగలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వైసీపీకి విశాఖ నగరంలో పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. నిర్ణయం తీసుకున్న బీజేపీకి విశాఖలో పెద్దగా పట్టులేకపోవడం, టీడీపీ, వైసీపీ మధ్యే మున్సిపల్ ఎన్నికల్లో అసలైన పోరు సాగుతుండటంతో దీన్నుంచి ఎలాగైనా బయటపడేందుకు వైసీపీ సర్కారు తీవ్ర మల్లగుల్లాలు పడుతోంది. విశాఖ ఎన్నికల్లో వైసీపీ రాజధాని తెచ్చిందన్న అంశం కంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేకపోతోందనే అంశమే హైలెట్ అవుతుండటంతో వైసీపీకి ఇబ్బందులు తప్పడం లేదు. టీడీపీ ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయం చేస్తుండటం వైసీపీకి చివరి నిమిషంలో తలనొప్పిగా మారింది.

వైసీపీ ఆక్రందన పట్టించుకోని కేంద్రం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం నిర్ణయం తీసుకున్న కేంద్రం... వైసీపీ సర్కారు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పట్టించుకునే పరిస్ధితుల్లో లేదు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీకరణను ఏపీలో మాత్రమే ఆపాలన్న డిమాండ్ అసలుకే ఎసరు తెస్తుందని కేంద్రం భావిస్తోంది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాజీ పడకూడదని భావిస్తోంది. దీంతో అటు కేంద్రాన్ని ఒప్పించలేక, అలాగని ప్రైవేటీకరణను అడ్డుకోలేదన్న అపప్రదను ఎన్నికల్లో మూటగట్టుకోలేక వైసీపీ నానా ఇబ్బందులు పడుతోంది. దీంతో ఓవైపు కేంద్రంతో లాబీయింగ్ కొనసాగిస్తూనే మరోవైపు స్టీల్ ప్లాంట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోస్కోతో సంప్రదింపులు మొదలుపెట్టింది.

పోస్కోకు జగన్ సర్కార్ ఆఫర్ ఇదే
ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దక్షిణకొరియాకు చెందిన పోస్కోకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో దీనికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసి బిడ్డింగ్‌కు కూడా వెళ్లబోతోంది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి పోస్కో దృష్టిమళ్లించేందుకు గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏపీలో మరో చోట గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు కోసం సహకారం అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఓ కొత్త స్టీల్ ప్లాంట్ నిర్మించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని పోస్కో ఇండియాకు ఏపీ సర్కార్ నిన్న లేఖ రాసింది. పోస్కో ముందుకొస్తే కృష్ణపట్నంలో కావాల్సిన భూమి, ఇతర సదుపాయాలు అందించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం ఆసక్తి రేపుతోంది.

పోస్కోకు ఆఫర్ వెనుక జగన్ సర్కార్ వ్యూహమిదేనా ?
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను చేజిక్కించుకునేందుకు పోస్కో ప్రయత్నాలు చేస్తున్న వేళ, వారికి కృష్ణపట్నంలో మరో కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం ఆఫర్ ఇవ్వడం వెనుక జీవీఎంసీ ఎన్నికల పోరు ఉందన్న ప్రచారం సాగుతోంది. జీవీఎంసీ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సెగ ఎదుర్కొంటున్న వైసీపీ... కృష్ణపట్నం ఆఫర్‌తో పోస్కోను వ్యూహాత్మకంగా దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తుందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. అదే నిజమైతే నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాదని కృష్ణపట్నం వైపు మొగ్గుచూపుతుందా అన్న వాదన తలెత్తుతోంది. అంతిమంగా కృష్ణపట్నంలో ప్లాంట్ ఏర్పాటు కోసం పోస్కో నుంచి ఏమాత్రం సానుకూల ప్రకటన వచ్చినా దాన్ని విశాఖ ఎన్నికల్లో వాడుకునేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్నికల సమయంలో ఈ లేఖ రాసినట్లు అర్ధమవుతోంది.