విశాఖలో చంద్రబాబుకు షాక్... వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల .. రేపే ముహూర్తం
ఏపీలో తాజా పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో విశాఖలోని టిడిపి నాయకులు జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. విశాఖను రాజధానిగా టిడిపి వ్యతిరేకించడాన్ని విశాఖలోని చాలా మంది టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామాల బాట పడుతున్నారు. వైసీపీ కి జై కొడుతున్నారు .

టీడీపీ కి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం తీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే
ఇదే క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విశాఖను రాజధానిగా టిడిపి వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అప్పటినుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం అధికార వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం రేపే ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.
రేపు పంచకర్ల రమేష్ బాబు తాడేపల్లి లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి కండువా కప్పుకోనున్నారు . వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు.

2009లో పొలిటికల్ ఎంట్రీ... రెండు సార్లు ఎమ్మెల్యే గా పనిచేసిన పంచకర్ల
2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పంచకర్ల రమేష్ బాబు అప్పుడు ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2014లో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ లతోపాటు టిడిపిలో చేరారు. 2014 ఎన్నికలలో ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో తిరిగి ఎలమంచిలి నుంచి పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు ఓటమి పాలయ్యారు.

టీడీపీ రూరల్ అధ్యక్షుడిగా కీలకంగా పని చేసిన పంచకర్ల
తెలుగుదేశం పార్టీలో విశాఖ రూరల్ అధ్యక్షుడు గా పార్టీలో కీలకంగా పనిచేసిన ఆయన విశాఖ రూరల్ నుండి ఏ ఒక్క సీటును గెలవకపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ గత ఎన్నికల తర్వాత అధ్యక్షుడిగా రాజీనామా చేశారు. తాజాగా జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ, విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయనున్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పారు . రేపు వైసిపిలో చేరనున్నారు.

వైసీపీలో చేరకుండా వెనక్కు తగ్గిన గంటా ... బీజేపీ వైపు దృష్టి
పంచకర్ల రమేష్ బాబు మాత్రమే కాదు విశాఖకు చెందిన ఎమ్మెల్యే , మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరతానని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటికే టిడిపి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు వైసిపి లో చేరడానికి తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే అవంతి శ్రీనివాస్ అడుగడుగున అడ్డుకోవడంతో పాటుగా, విశాఖ భూ కుంభకోణం లో గంటా అనుచరుల పాత్ర ఉన్న కారణంగా వైసిపి అధినేత ఇప్పటివరకు గంటా విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం బిజెపి వైపు గంటా శ్రీనివాస రావు చూస్తున్నట్లుగా తెలుస్తోంది.