visakhapatnam tdp congress left parties ap bandh విశాఖపట్నం టీడీపీ కాంగ్రెస్ వామపక్షాలు ఏపీ బంద్ kadapa steel plant Visakhapatnam Steel Plant politics
ఏపీ షట్‌డౌన్: విశాఖకు చంద్రబాబు: బంద్‌కు సంఘీభావం: భారీ బందోబస్తు
విశాఖపట్నం: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట్రంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కొద్దిరోజులుగా కొనసాగుతోన్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు.. మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇందులో భాగంగా కార్మిక సంఘాల ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు కూడా బంద్‌కు సంఘీభావాన్ని ప్రకటించాయి. ఫలితంగా- తెల్లవారు జాము నుంచే బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తెరచుకోలేదు.
రాష్ట్ర బంద్‌కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో- తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు. విశాఖలో ఉక్కు పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, పార్టీ నాయకులు నిర్వహించే ధర్నాలు, ఆందోళనల్లో ఆయన పాల్గొననున్నారు. కాంగ్రెస్, వామపక్ష నాయకులతో కలిసి ఆయన నిరసన సభల్లో వేదికను పంచుకోనున్నారు. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, సీపీఐ సీనియర్ నేత నారాయణ, విశాఖ సీపీఎం నేతలతో కలిసి చంద్రబాబు ర్యాలీని నిర్వహించనున్నారు.

బంద్‌లో భాగంగా విశాఖపట్నం బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతలు నిరసన ప్రదర్శనలను చేపట్టారు. అక్కడే బైఠాయించారు. బస్సులను నిలిపివేశారు. ఈ ఆందోళనల్లో ప్రజాసంఘాల జేఏసీ, సీఐటీయూ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ నరసింగరావు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలనే డిమాండ్ చేశారు. ఫ్లెక్సీలు, ప్లకార్డులను ప్రదర్శించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.
విజయవాడలో వామపక్ష నేతలు, టీడీపీ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదురుగా బైఠాయించారు. ఎర్రజెండాలను చేతబట్టుకుని పెద్ద సంఖ్యలో సీపీఐ, సీపీఎం సహా తొమ్మిది వామపక్ష నాయకులు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇతర అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు సహా పలువురు నాయకులు దీనికి హాజరయ్యారు. ప్రదర్శనలను నిర్వహించారు. అధికార వైఎస్సార్సీపీ కూడా సంఘీభావం తెలిపిన నేపథ్యంలో ఆ పార్టీ వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పీ గౌతమ్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.