వైసీపీ నేతలతో గంట శ్రీనివాస్ చెట్టాపట్టాల్: సుదీర్ఘ మంతనాలు: రెడ్ కార్పెట్ వేస్తారా?
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు చాలాకాలం తరువాత బహిరంగ కార్యక్రమాల్లో కనిపిస్తోన్నారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన క్రీయాశీలక రాజకీయాల్లో ఉండట్లేదు. తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఉండీ లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ- అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన నేపథ్యంలో అక్కడికీ వెళ్లనక్కర్లేకుండా పోయింది.

మూడు రాజధానులను స్వాగతించినా..
ఇదివరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ వార్తలొచ్చాయి. ముహూర్తం సైతం ఖాయం చేసుకున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను ఆయన బహిరంగంగా స్వాగతించారు కూడా. విశాఖపట్నాన్ని రాష్ట్ర పరిపాలన రాజధానిగా బదలాయిండాన్ని బలపరిచారు. ఆ అర్హత విశాఖకు తప్ప మరో నగరానికి లేదని కూడా చెప్పుకొచ్చారు.

క్రియాశీల రాజకీయాలకు దూరంగా..
ఆ తరువాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తెరమీదికి రావడంతో తన పదవికి రాజీనామా చేశారు. క్రియాశీలక రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. తనకంటూ సొంత ఇమేజ్ను ఏర్పరచుకున్నారాయన. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం వల్ల ఏ పార్టీలో ఉన్నా గంటా శ్రీనివాస్ విజయం నల్లేరుమీద నడకేనని చెబుతుంటారు. ఇది వరకు ప్రజారాజ్యం పార్టీ, టీడీపీల్లో ఎమ్మెల్యేగా వరుస విజయాలను సాధించారు.

ఏ పార్టీలో చేరుతారో..
అలాంటి నాయకుడు రాజకీయాలకు దూరంగా ఉండటం ఉత్తరాంధ్రలో కొంతకాలంగా చర్చనీయాంశమౌతోంది. తెలుగుదేశం పార్టీలో కొనసాగే అవకాశాలు దాదాపు లేనట్టేననే ప్రచారం సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ కండువా వేసుకుంటారనేది ఇదివరకు హాట్ టాపిక్‌గా ఉండేది. వైసీపీ, బీజేపీ, జనసేన.. ఇలా అన్ని పార్టీల పేర్లూ చక్కర్లు కొట్టాయి. అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఏ పార్టీలోనూ చేరలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటం వల్ల పార్టీ ఫిరాయింపునకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు.

వైసీపీ నేతలతో..
తాజాగా వైసీపీ సీనియర్ నేతలతో గంటా శ్రీనివాస్ వేదికను పంచుకోవడం, వారితో సుదీర్ఘంగా చర్చించడం మరోసారి చర్చల్లోకి ఎక్కింది. విశాఖపట్నం జిల్లా పాయకరావు పేటలో- ప్రముఖ కాపు నాయకుడు, దివంగత వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో కలిసి ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోకీలక వ్యాఖ్యలు చేశారు గంటా శ్రీనివాస్.

కాపుల కోసం
కాపు సామాజికవర్గం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందని గంటా శ్రీనివాస్ చెప్పారు. కాపులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాపు సామాజిక వర్గం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి, బలోపేతం కావడానికి తాను కృషి చేస్తానని అన్నారు. భవిష్యత్తులో ఏపీని శాసించేది కాపులేనని అన్నారు. రాష్ట్రం నలుమూలలా ఉన్న కాపులను ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తానని, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన వైసీపీ నేతలతో సుదీర్ఘ మంతనాలు సాగించారు.