విశాఖలో పర్యాటక అద్భుతం‘ఎంప్రెస్’భారీక్రూయిజ్; ప్రత్యేకతలు ఎన్నో.. సాగర విహారానికి రెడీ అయిపోండిక!!
విశాఖ పోర్టులో భారీ క్రూయిజ్ నౌక ఎంప్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది. విహార ప్రపంచంలోనే అద్భుతాలను చూపిస్తూ, పర్యాటక రంగంలో క్రూయిజ్ సేవలకు భారీ కృషిచేస్తూ ఎంప్రెస్ రెడీ అయింది. విశాఖపట్నం నుండి పుదుచ్చేరి మరియు చెన్నైకి మూడు రోజుల ప్రయాణం అద్భుతమైన మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. సాగర జిల్లాలో మూడు రోజుల పాటు కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి సకల సౌకర్యాలతో 11 అంతస్తుల క్రూయిజ్ షిప్ ఎంప్రెస్ విశాఖకు వచ్చింది.

నేటి నుండి రెగ్యులర్ సేవలు అందించనున్న ఎంప్రెస్
నేటి నుంచి ఎంప్రెస్ తన రెగ్యులర్ సేవలను అందించనుంది. జూన్ 8వ తేదీ నుండి తొలి సర్వీస్ ను ప్రారంభిస్తున్న ఎంప్రెస్ క్రూయిజ్ షిప్ నిర్వహణకు జేఎం భక్షి సంస్థకు విశాఖపట్నం పోర్టు అధికారులు అనుమతినిచ్చారు. ఎంప్రెస్ విదేశీ విహార నౌక అయినప్పటికీ, భారత్‌లో మాత్రమే తిరిగే విధంగా నిర్వాహకులు అనుమతులు పొందారు. ఇక ఎంప్రెస్ షిప్ ఎక్కాలి అంటే పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఇక దీనిలో కస్టమ్స్ తనిఖీలు ఉండవు. గతంలో వైజాగ్ కు 1,2 క్రూయిజ్ షిప్ లు మాత్రమే వచ్చి వెళ్ళేవి.

11 అంతస్తుల ఈ క్రూయిజ్ లో అత్యాధునిక సకల సౌకర్యాలు
కానీ ప్రస్తుతం ఎంప్రెస్ రెగ్యులర్ సర్వీసులు నడపడానికి సిద్ధమైంది. 11 అంతస్తుల ఈ క్రూయిజ్ లో అత్యాధునిక సకల సౌకర్యాలు ఉన్నాయి. క్యాసినో, బార్, స్పా, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన నగరాల్లో పర్యాటక ప్రాంతాలను సందర్శన చేస్తూ ఈ ఎంప్రెస్ విహార నౌక తన ప్రయాణాన్ని సాగించనుంది. ఒకేసారి 1,800 మంది ప్రయాణం చేసే సామర్థ్యంతో ఎంప్రెస్ షిప్ సేవలను అందించనుంది.

11 అంతస్తుల ఈ క్రూయిజ్ లో అన్నీ ప్రత్యేకతలే
ఇంటీరియర్, సముద్రం వ్యూ, బాల్కనీ, సూట్ మరియు ఛైర్మన్స్ సూట్ - ఎంప్రెస్ ఐదు రకాల డబుల్ ఆక్యుపెన్సీ గదులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి, మరియు భారతీయ మరియు అంతర్జాతీయ వంటకాలలో ఉత్తమమైన ఆహారాన్ని అందించే ఫుడ్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, రెస్టారెంట్, లాంజ్‌లు, క్యాసినో, లైవ్ షోలు, కార్డెలియా అకాడమీ ఫర్ కిడ్స్, డీజే వినోదం మరియు రాక్ క్లైంబింగ్ వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉండటం విశేషం.

విహార నౌకలో గదుల ధరలు ఇలా
సెయిలింగ్ తేదీలు జూన్ 8, 15 మరియు 22. ప్రారంభ క్రూయిజ్ తర్వాత, విశాఖపట్నం ఓడరేవును మరిన్ని క్రూయిజ్ షిప్‌లు సందర్శించే అవకాశం ఉంది. విశాఖపట్నం సందర్శించడం ఇది మొదటి క్రూయిజ్ షిప్ కానప్పటికీ, ఓడరేవు నగరానికి సాధారణ క్రూయిజ్ సర్వీసును నడపడం ఇదే మొదటిసారి. ఇందులో ఒక్కో గదికి రూ. 48,582 నుండి ప్రారంభమవుతుంది. ఓషన్ వ్యూ గదికి రూ. 60,389, మినీ-సూట్‌కు రూ. 1,06,024 మరియు సూట్‌కు రూ. 1,89,772గా నిర్ణయించింది .